ఊయలే ఉరితాడై..
∙ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలుడి మృతి
∙కన్నాయిగూడెంలో విషాదం
కన్నాయిగూడెం(నెల్లిపాక) : సరదాగా ఊయలతో ఆడుకుంటున్న ఆబాలుడికి ఆ చీర ఊయలే ఉరి తాడై బలితీసుకున్న ఘటన ఎటపాక మండలం లోని కన్నాయిగూడెంలో చోటుచేసుకుంది. మోరంపల్లి బాబు, శ్రీదేవి దంపతులకు సాగర్ (13) ఒక్కడే కుమారుడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. ఉదయమే తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిపోయారు. సాగర్‌కు మధ్యాహ్నం పరీక్ష ఉండడంతో ఇంటివద్దే స్నేహితుడితో కలిసి చీరతో కట్టిన ఊయలతో ఆడుకున్నాడు. వేలాడుతూ గుండ్రంగా తిరుగుతూ ఆడుకుంటున్నాడు. ఆ చీర మెడకు గట్టిగా చుట్టుకోవడంతో ఊపిరాడలేదు. బాలుడి స్నేహితుడు అక్కడకు వచ్చి ఊయలలో చిక్కుకున్న సాగర్‌ను చూసి చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారు బాలుడిని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యుడు నిర్ధారించాడు. కూలి పనులకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి.