hammock
-
ఉరితాడైన ఊయల
కోలారు: ఊయల ఊగుతూ చీర గొంతుకు చుట్టుకుని ఉరితాడై బాలిక మరణించిన ఘటన ముళబాగిలు తాలూకా నంగలి ఫిర్కా పెద్దూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలు మేఘన(12). మరో బాలిక దేవిశ్రీ పరిస్థితి తీవ్రంగా ఉంది. వీరిద్దరు రాత్రి చీరతో ఊయల వేసుకుని ఊగుతుండగా ఊయల గిరగిరా తిరుగుతూ ఇద్దరి మెడలకు బిగుసుకుంది. ఈ సంఘటనలో మేఘనా మరణించగా, దేవిశ్రీ అనే బాలిక చావుబతుకుల్లో ఉంది. ఆమెను బెంగుళూరులోని ఆస్పత్రికి తరలించారు. నంగలి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: నకిలీ డాక్టర్ల దోపిడీ గుట్టు రట్టు..! -
ఊపిరి తీసిన ఊయల తాడు
సాక్షి, దాచేపల్లి/గుంటూరు: ఊయల ఊగుతుండగా తాడు గొంతుకు బిగుసుకోవడంతో ఓ చిన్నారి మృత్యు ఒడికి చేరింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు సుగాలి కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన మూఢావత్ బద్దునాయక్, కమలాబాయి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం కాగా రెండో కుమార్తె కూలి పనులకు వెళుతోంది. మిగిలిన ముగ్గురు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హైస్కూల్లో చదువుకుంటున్నారు. వీరిలో చిన్న కుమార్తె అయిన మూఢావత్ సిరి (10) ఐదో తరగతి చదువుకుంటోంది. ఆదివారం సెలవు కావటంతో ఇంటి వెనుక భాగంలో ఉన్న పశువుల కొట్టంలో వెదురు బొంగుకు తాడును కట్టి ఊయల ఊగుతోంది. ఆ క్రమంలో తాడు జారిపోయి బాలిక గొంతుకు బలంగా బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక సిరి మృతి చెందింది. పశువుల కొట్టం మీదుగా వెళుతున్న వ్యక్తులు సిరి తాడుకు వేలాడుతున్న విషయాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అయితే అప్పటికే బాలిక చనిపోయింది. కుటుంబ సభ్యులంతా భోరున విలపిస్తున్నారు. -
ఊయలే ఉరితాడై..
పాణ్యం: ఊయలే ఉరితాడైంది..ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పాణ్యం గ్రామానికి చెందిన అబిబా, మాబాషాలకు కుమారుడు, కుమార్తె సంతానం. రోజులాగే తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. ఇంటి వద్ద ఉన్న కుమార్తె సునయన (13) చెట్టుకు ఊయల వేసుకొని ఆడుకుంటూ ఉంది. ఊయలలో కూర్చుని తాడును పురితిప్పగా అది తిరిగి అతి వేగంగా వ్యతిరేక దిశలో మెలితిరిగి.. ఒక్కసారిగా సునయన మెడకు బిగుసుకుంది. గమనించిన స్థానికులు, బంధువులు హుటాహుటిన నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందింది. సునయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. కేసు నమోదు చేసినట్లు పాణ్యం హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి తెలిపారు. -
ఊయలే ఉరితాడై..
ప్రకాశం, అద్దంకి: అప్పటి వరకు ఊయలలో ఊగుతూ చిన్నారి కేరింతలు కొట్టింది. కిలకిలా నవ్వింది. అంతలోనే ఆ ఊయలే ఆ చిన్నారి పాలిట ఉరితాడుగా మారింది. ఊయలగా చేసిన చీర మెడకు చుట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పట్టణంలోని రాజీవ్ కాలనీలో సోమవారం జిరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ కాలనీలో రాజు కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి లక్ష్మీ ప్రసన్న (9) అనే కుమార్తె ఉంది. ఈ క్రమంలో బాలిక తండ్రి రెండు నెలల క్రితం, తల్లి 9 నెలల క్రితం మృతి చెందారు. చిన్నారి అత్త వద్దే ఉంటోంది. దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మకు చీరను ఊయలగా వేసుకుని బాలిక ఊగుతోంది. ఊయల గిరగిరా గుండ్రంగా తిరగడం ప్రారంభించింది. కొద్దిసేపటికి చీర పైనుంచి మెలికలు పడటం మొదలు పెట్టింది. చిన్నారి కిందకు జారిన సమయంలో చీర మెడకు చుట్టుకుని బిగుసుకోవడంతో ఊపిరి ఆడక మృతి చెందిందని స్థానికులు చెబుతున్నారు. బాలిక మృతిపై పలు అనుమానాలు చిన్నారి తల్లిదండ్రులు ఇదివరకే మరణించడంతో బాలిక పేరుతో ఉన్న ఆస్తి కోసం బంధువులెవరైనా హత్య చేసి ఊయల ఊగుతూ మృతి చెందిందనే కథ అల్లి ఉండొచ్చనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విధంగా మృతి చెందింది పోస్టుమార్టం రిపోర్టులో తెలియాల్సి ఉంది. బాలిక మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బాలుడు ఉయల కట్టుకుని ఊగుతుండగా... విషాదం
సాక్షి, హైదరాబాద్ : చింత చెట్టుకు ఊయల కట్టుకుని ఊగుతున్న బాలుడిపై పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం సమీపంలోని అంజిరెడ్డి నగర్కు చెందిన ఇంద్రావత్ అఖిల్ అనే బాలుడు చింతచెట్టుకు ఉయల కట్టుకుని ఊగుతున్నాడు. సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో అతనిపై పిడుగు పడటంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. దీంతో బాలుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ఊయలే ఉరితాడై..
∙ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బాలుడి మృతి ∙కన్నాయిగూడెంలో విషాదం కన్నాయిగూడెం(నెల్లిపాక) : సరదాగా ఊయలతో ఆడుకుంటున్న ఆబాలుడికి ఆ చీర ఊయలే ఉరి తాడై బలితీసుకున్న ఘటన ఎటపాక మండలం లోని కన్నాయిగూడెంలో చోటుచేసుకుంది. మోరంపల్లి బాబు, శ్రీదేవి దంపతులకు సాగర్ (13) ఒక్కడే కుమారుడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. ఉదయమే తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిపోయారు. సాగర్కు మధ్యాహ్నం పరీక్ష ఉండడంతో ఇంటివద్దే స్నేహితుడితో కలిసి చీరతో కట్టిన ఊయలతో ఆడుకున్నాడు. వేలాడుతూ గుండ్రంగా తిరుగుతూ ఆడుకుంటున్నాడు. ఆ చీర మెడకు గట్టిగా చుట్టుకోవడంతో ఊపిరాడలేదు. బాలుడి స్నేహితుడు అక్కడకు వచ్చి ఊయలలో చిక్కుకున్న సాగర్ను చూసి చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారు బాలుడిని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యుడు నిర్ధారించాడు. కూలి పనులకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి. -
అరకే ఊయల
ఆదిలాబాద్ మండలంలోని లాండసాంగ్రి గ్రామంలో తన పొలంలో అరక దున్నుతూ... అదే అరకకు ఊయల కట్టి అందులో బిడ్డను పడుకోబెట్టి లాలిపాట పాడుతూ కలుపు తొలగిస్తున్న తండ్రి పరమేశ్వర్. - ఆదిలాబాద్ నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం