తల్లి ఒడిలోనే.. మృత్యు ఒడిలోకి..
- 12 గంటల తర్వాత బాలుడి మృతి నిర్ధారణ
పావగడ : అనంతపురం జిల్లా పుట్టపర్తి కి చెందిన ప్రశాంతి నిలయం అంబులెన్స్ డ్రైవర్ ఆంజనేయులు, మానసిక రోగి మంజుల దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు సంతానం. కూతురు ఇదివరకే చనిపోయింది. భర్త ఊళ్లో లేని సమయంలో మంజుల తన కుమారుడు సంపత్‌కుమార్ (2) ఉంగరాన్ని అమ్మి ఆ డబ్బుతో కుమారుడిని తీసుకుని స్వస్థలం కర్ణాటక రాష్ట్రం చింతామణికి మూడు రోజుల క్రితం బయల్దేరింది. బాగేపల్లి, చింతామణి, బెంగుళూరు ఇలా 12 గంటల పాటు కొడుకును గుడ్డలో చుట్టుకుని శనివారం రాత్రి పావగడకు చేరుకుంది. గుడ్డలో చుట్టుకున్న బాలుడిని తలచుకుంటూ ఏడుస్తూ కూర్చుండిపోయిన ఆమెను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడకు వచ్చి తల్లీ, కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుడ్డలో ఉన్న బాలుడిని పరీక్షించిన వైద్యుడు రంగేగౌడ 12 గంటల క్రితమే బాలుడు మృతి చెందాడని ధ్రువీకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుమకూరు ఆస్పత్రికి తరలించారు. అలాగే మానసిక రోగి మంజులకు వైద్య చికిత్స అందించారు.
పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయాలు వెలుగులోకి...
అయితే తల్లే బాలుడిని చంపిందా.. లేక ఊపిరాడక బాలుడే చనిపోయాడా అనే విషయాలు పోస్టుమార్టం నివేదికలో తెలుస్తాయని డీఎస్పీ కల్లేశప్ప తెలిపారు. పావగడకు ఆదివారం చేరుకున్న భర్త ఆంజనేయులు.. కుమారుడి మృతదేహం చూసి రోదించాడు. రెండేళ్ళ క్రితం కూతురు రంజిత్ కుమారిని కూడా మంజుల దుప్పటిలో చుట్టి చంపేసిందని, ఇప్పుడు కూడా ఈ పిల్లవాడిని తన భార్యే చంపేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్య పిచ్చి నయం చేయించడానికి నిమ్హాన్స్‌లో చికిత్స చేయించినా ప్రయోజనం లేక పోయిందని విలపించాడు. ఎస్‌ఐ మంజునాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.