ఆడుకునేందుకు వెళ్లి.. అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడి..
ఆడుకునేందుకు వెళ్లి.. అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడి..
Published Fri, Sep 2 2016 12:00 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
పాత ఆర్‌ఆర్‌పేట (పూర్ణానందంపేట) :
ఆడుకునేందుకు వెళ్లి అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మంగళవారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత ఆర్‌ఆర్‌పేట మహాంకాళమ్మగుడివీధిలో నివాసముండే తాటికాయల దుర్గారావు, లక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారుడు శ్రీకాంత్(6) ఉన్నారు. ఏడు నెలల క్రితం అనారోగ్యంతో దుర్గారావు మృతిచెందాడు. కుమార్తె శివదుర్గ మానసిక వికలాంగురాలు కాగా, శ్రీకాంత్ స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. శ్రీకాంత్ మంగళవారం సాయంత్రం స్నేహితుడితో కలసి పాత ఆర్‌ఆర్‌పేటలోని జేపీ టవర్స్ వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. పక్కనే ఉన్న అవుట్ ఫాల్ డ్రెయిన్‌లో జారిపడి గల్లంతయ్యడు. అతని స్నేహితుడు భయంతో ఇంటికి వెళ్లిపోయాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో లక్ష్మి స్థానికంగా వెదికినా ప్రయోజనం లేకపోయింది. శ్రీకాంత్ వెంట వెళ్లిన బాలుడిని బుధవారం రాత్రి ప్రశ్నించగా... అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడిపోయినట్లు చెప్పాడు. ఆమె వెంటనే కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే చికటి పడటంతో గురువారం ఉదయం బాలుడి కోసం పోలీసు, ఫైర్, కార్పొరేషన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. తన కుమారుడు అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడిపోయాడని తెలిసినప్పటి నుంచి లక్ష్మి అక్కడే కూర్చుని రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. మరోవైపు తన తమ్ముడు కనిపించాడా.. అంటూ శ్రీకాంత్ ఫొటో పట్టుకుని మానసిక వికలాంగురాలైన శివదుర్గ అక్కడికి వెళ్లిన వారిని అడుగుతుండడంతో పలువురు కంటతడి పెట్టారు.
Advertisement