canel
-
భర్తతో గొడవ.. పిల్లలతో కాలువలో దూకిన తల్లి
నందిపేట్ (ఆర్మూర్): భర్తతో చిన్నపాటి గొడవ జరగడంతో క్షణికావేశంలో పిల్లలతో కలిసి కాలువలో దూకింది ఓ తల్లి. కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడగా చిన్నారులు నీట మునిగి చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలియో చుక్కలు వేయిస్తానని.. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్‌తో నందిపేటకు చెందిన అమృత అలియాస్ సోనికి నాలుగున్నర సంవత్సరాల కిందట వివాహం జరిగింది. శ్రీనివాస్ నందిపేటకు వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు మనుశ్రీ (3), మనుతేజ (6 నెలలు) ఉన్నారు. శ్రీనివాస్ ఇటీవల ట్రాక్టర్ కొన్నాడు. దీంతో అప్పులయ్యాయని ఇంట్లో తరచూ భార్యతో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ట్రాక్టర్‌కు ట్రాలీ కొని రిజిస్ట్రేషన్ చేయించేందుకు సోమవారం ఆర్మూర్‌కు వెళ్లాడు. భర్త తన మాట వినట్లేదని కోపంతో అమృత.. పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తానని మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరింది. నందిపేట శివారులో నిండుగా పారుతున్న గుత్ప ఎత్తిపోతల పథకం కాలువ వద్దకు వెళ్లి బ్రిడ్జిపై నుంచి పిల్లలతో సహా దూకింది. ప్రమాదవశాత్తు పడిపోయా: తల్లి కొడుకులతో కలిసి తల్లి దూకడాన్ని స్థానికులు చూసి కేకలు వేశారు. కాలువలో కొద్ది దూరం కొట్టుకు పోయిన అమృత ఓ పైపును పట్టుకుని ఆగింది. అటుగా వెళ్తున్న డిచ్పల్లి క్యాంపు స్పెషల్ పోలీసు బెటాలియన్ కానిస్టేబుల్ రాకేశ్ కాలువలోకి దిగి అమృతను ఒడ్డుకు చేర్చాడు. పోలీసులు గుత్ప ఎత్తిపోతల పథకం మోటార్లను నిలిపి వేయించారు. నీటి ఉధృతి తగ్గాక జాలర్లు ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. కాలువలో దూకడంపై అమృతను స్థానికులు ప్రశ్నించగా.. కూతురు నీరు తాగడానికి కాలువలోకి దిగి పడిపోయిందని, తన బిడ్డను కాపాడే ప్రయత్నంలో చంకలో ఎత్తుకున్న కొడుకుతో సహా తాను ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయానని పొంతన లేని సమాధానం చెప్పింది. -
కాలువలో పడి జెడ్పీటీసీ మాజీ సభ్యుడి మృతి
చిత్తూరు అర్బన్ : నగరంలోని కొంగారెడ్డిపల్లెలో మురుగునీటి కాలువలో పడి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మురగయ్య (65) మృతిచెందారు. ఎస్ఆర్పురం జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా పనిచేసిన మురగయ్య చిత్తూరు రీడ్స్‌పేటలో కాపురముంటున్నారు. మంగళవారం కొంగారెడ్డిపల్లె వైపు నుంచి కాలినడకన ఇంటికి వస్తుం డగా పక్కనే ఉన్న మురుగునీటి కాలువలో పడిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో పడి యువకుడి గల్లంతు
గుడివాడ: ప్రమాద వశాత్తు కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద ఎరుకపాడు వార్పు రోడ్డులో నివాసం ఉంటున్న పఠాన్ బిస్మిల్లా (23) తాపీ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కార్మిక నగర్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో చంద్రయ్యడ్రైను వద్ద స్నేహితులతో మాట్లాడుతూ కాలుజారి కాలువలో పడ్డాడు. డ్రైను ఉధృతంగా ఉండటం వల్ల ప్రవాహానికి కొట్టుకు పోతుండటంతో స్నేహితుడు శ్రీకాంత్ కాలువలోకి దూకి రక్షించేందుకు యత్నించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పోలీసులకు తెలపటంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదని బంధువులు తెలిపారు. -
పుల్లేరు కాలువలో బాలుడి గల్లంతు
వినాయకుడిని చూసేందుకు ళ్లగా ప్రమాదం కొనసాగుతున్న గాలింపు చర్యలు కురుమద్దాలి(పామర్రు) : వినాయక చవితి వేడుకుల్లో సోమవారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దేవుడి చూద్దామని వెళ్లిన బాలుడు కాలువలో గల్లంతు అయ్యాడు. వివరాలు.. బీసీ కాలనీకి చెందిన ఆరేపల్లి శ్రీనివాసరావు, మేరీ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె కామాక్షి స్థానిక పాఠశాలలో చదువుతోంది. కుమారుడు కార్తీకేయ(4) పామర్రులోని ఏఎన్ఎం స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. ఇంటి వద్ద పూజలు ముగిసిన తరువాత పుల్లేరు కాలువ గట్టుపై ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్దకు వెళ్లేందుకు చిన్నారులు బయలుదేరారు. దారిలో కామాక్షి స్నేహితురాలు కలిసి కార్తీకేయను మండపం వద్ద నేను తీసుకువెళ్తానని చెప్పడంతో బాలుడి అక్క తిరిగి ఇంటికి వెళ్లి పోయింది. పందిరి వద్దకు వెళ్తూ దారిలో పుల్లేరులో చేపలు బాగా ఉన్నాయి చూద్దామని ఇద్దరూ కలిసి కాలువలోకి దిగారు. దీంతో కార్తీకేయ అదుపు తప్పి కాలువలోకి పడిపోయాడు. ఈ విషయాన్ని స్నేహితురాలు పరుగున వచ్చి ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. వారు వచ్చి కార్తీకేయ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ కాలువలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. 9వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఆడుకునేందుకు వెళ్లి.. అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడి..
పాత ఆర్‌ఆర్‌పేట (పూర్ణానందంపేట) : ఆడుకునేందుకు వెళ్లి అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మంగళవారం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత ఆర్‌ఆర్‌పేట మహాంకాళమ్మగుడివీధిలో నివాసముండే తాటికాయల దుర్గారావు, లక్ష్మి దంపతులకు కుమార్తె, కుమారుడు శ్రీకాంత్(6) ఉన్నారు. ఏడు నెలల క్రితం అనారోగ్యంతో దుర్గారావు మృతిచెందాడు. కుమార్తె శివదుర్గ మానసిక వికలాంగురాలు కాగా, శ్రీకాంత్ స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. శ్రీకాంత్ మంగళవారం సాయంత్రం స్నేహితుడితో కలసి పాత ఆర్‌ఆర్‌పేటలోని జేపీ టవర్స్ వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. పక్కనే ఉన్న అవుట్ ఫాల్ డ్రెయిన్‌లో జారిపడి గల్లంతయ్యడు. అతని స్నేహితుడు భయంతో ఇంటికి వెళ్లిపోయాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో లక్ష్మి స్థానికంగా వెదికినా ప్రయోజనం లేకపోయింది. శ్రీకాంత్ వెంట వెళ్లిన బాలుడిని బుధవారం రాత్రి ప్రశ్నించగా... అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడిపోయినట్లు చెప్పాడు. ఆమె వెంటనే కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే చికటి పడటంతో గురువారం ఉదయం బాలుడి కోసం పోలీసు, ఫైర్, కార్పొరేషన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. తన కుమారుడు అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడిపోయాడని తెలిసినప్పటి నుంచి లక్ష్మి అక్కడే కూర్చుని రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. మరోవైపు తన తమ్ముడు కనిపించాడా.. అంటూ శ్రీకాంత్ ఫొటో పట్టుకుని మానసిక వికలాంగురాలైన శివదుర్గ అక్కడికి వెళ్లిన వారిని అడుగుతుండడంతో పలువురు కంటతడి పెట్టారు. -
కాలువలో పడి బాలిక మృతి
పమిడిముక్కల : మేడూరు శివారు మత్రాసిపాలెంలో కన్నెకలమడుగు రేవులో సోమవారం బట్టలు ఉతికేందుకు దిగి ఒక బాలిక ప్రమాదవశాత్తు మరణించింది. స్థానికుల కథనం ప్రకారం ముత్రాసిపాలెంకు చెందిన కొండవీటి నిఖిత (12) అనే బాలిక మేడూరు హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు నాని, కామాక్షి విజయవాడలో పనులకు వెళ్లిపోగా, స్నేహితురాళ్లయిన సుశీల, శశిలతో బట్టలు ఉతికేందుకు రేవుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు రేవులో పడి నీటి వేగానికి కొట్టుకుపోతుంటే అక్కడే ఉన్న ముచ్చు శ్రీనివాసరావు, కొండవీటి నిఖిల్‌లు వెంటనే కాలువలోకి దిగి ఇరువురిని బయటకు తీసుకు వచ్చారు. నిఖిత మాత్రం దొరకలేదు. గాలించగా నీటి అడుగున విగతజీవిగా దర్శనమిచ్చింది. తమ కంటిదీపం తిరిగిరాదని తెలిసి తల్లిదండ్రులు,బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సారెస్పీకాలువకు గండి
కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం నగునూరుశివారులో డి–89 ఎస్సారెస్పీ కాలువకు కొందరు రైతులు గండికొట్టడం వివాదస్పదంగా మారింది. గ్రామ సమీపంలోని కాలువకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన రైతులు గురువారం తెల్లవారు జామున గండికొట్టారు. కాలువ వద్దే రైతులు పెద్దసంఖ్యలో మోహరించి చెరువుకు నీటిని తరలించడంతో చివరి ఆయకట్టు గ్రామాలకు నీళ్లందని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులకు అక్రమ నీటితరలింపుపై ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. -
వరదకాలువలో విద్యార్థి గల్లంతు
మల్యాల: మల్యాల మండలం నూకపల్లి చెందిన ఇంటర్ విద్యార్థి మునుగూరి దిలీప్‌కుమార్(16) ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. దిలీప్‌కుమార్ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని రామన్నపేట బ్రిడ్జి వద్ద వరదకాలువలో ఈతకు వెళ్లాడు. ఈతకొడుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.