చిన్నారులు మనుశ్రీ, మనుతేజ (ఫైల్)
నందిపేట్ (ఆర్మూర్): భర్తతో చిన్నపాటి గొడవ జరగడంతో క్షణికావేశంలో పిల్లలతో కలిసి కాలువలో దూకింది ఓ తల్లి. కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడగా చిన్నారులు నీట మునిగి చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పోలియో చుక్కలు వేయిస్తానని..
నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్‌తో నందిపేటకు చెందిన అమృత అలియాస్ సోనికి నాలుగున్నర సంవత్సరాల కిందట వివాహం జరిగింది. శ్రీనివాస్ నందిపేటకు వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు మనుశ్రీ (3), మనుతేజ (6 నెలలు) ఉన్నారు. శ్రీనివాస్ ఇటీవల ట్రాక్టర్ కొన్నాడు. దీంతో అప్పులయ్యాయని ఇంట్లో తరచూ భార్యతో గొడవ జరుగుతోంది.
ఈ క్రమంలో శ్రీనివాస్ ట్రాక్టర్‌కు ట్రాలీ కొని రిజిస్ట్రేషన్ చేయించేందుకు సోమవారం ఆర్మూర్‌కు వెళ్లాడు. భర్త తన మాట వినట్లేదని కోపంతో అమృత.. పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తానని మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరింది. నందిపేట శివారులో నిండుగా పారుతున్న గుత్ప ఎత్తిపోతల పథకం కాలువ వద్దకు వెళ్లి బ్రిడ్జిపై నుంచి పిల్లలతో సహా దూకింది.
ప్రమాదవశాత్తు పడిపోయా: తల్లి
కొడుకులతో కలిసి తల్లి దూకడాన్ని స్థానికులు చూసి కేకలు వేశారు. కాలువలో కొద్ది దూరం కొట్టుకు పోయిన అమృత ఓ పైపును పట్టుకుని ఆగింది. అటుగా వెళ్తున్న డిచ్‌పల్లి క్యాంపు స్పెషల్ పోలీసు బెటాలియన్ కానిస్టేబుల్ రాకేశ్ కాలువలోకి దిగి అమృతను ఒడ్డుకు చేర్చాడు. పోలీసులు గుత్ప ఎత్తిపోతల పథకం మోటార్లను నిలిపి వేయించారు. నీటి ఉధృతి తగ్గాక జాలర్లు ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికి తీశారు.
కాలువలో దూకడంపై అమృతను స్థానికులు ప్రశ్నించగా.. కూతురు నీరు తాగడానికి కాలువలోకి దిగి పడిపోయిందని, తన బిడ్డను కాపాడే ప్రయత్నంలో చంకలో ఎత్తుకున్న కొడుకుతో సహా తాను ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయానని పొంతన లేని సమాధానం చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment