కాలువలో పడి బాలిక మృతి
పమిడిముక్కల :
మేడూరు శివారు మత్రాసిపాలెంలో కన్నెకలమడుగు రేవులో సోమవారం బట్టలు ఉతికేందుకు దిగి ఒక బాలిక ప్రమాదవశాత్తు మరణించింది. స్థానికుల కథనం ప్రకారం ముత్రాసిపాలెంకు చెందిన కొండవీటి నిఖిత (12) అనే బాలిక మేడూరు హైస్కూల్‌లో ఏడవ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు నాని, కామాక్షి విజయవాడలో పనులకు వెళ్లిపోగా, స్నేహితురాళ్లయిన సుశీల, శశిలతో బట్టలు ఉతికేందుకు రేవుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు రేవులో పడి నీటి వేగానికి కొట్టుకుపోతుంటే అక్కడే ఉన్న ముచ్చు శ్రీనివాసరావు, కొండవీటి నిఖిల్‌లు వెంటనే కాలువలోకి దిగి ఇరువురిని బయటకు తీసుకు వచ్చారు. నిఖిత మాత్రం దొరకలేదు. గాలించగా నీటి అడుగున విగతజీవిగా దర్శనమిచ్చింది. తమ కంటిదీపం తిరిగిరాదని తెలిసి తల్లిదండ్రులు,బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.