
సినీ పరిశ్రమకు ఇబ్బందేమీ లేదు
పెనుగంచిప్రోలు : తెలుగు సినిమా పరిశ్రమపై పెద్దనోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఏమీ ఉండదని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ అమ్మవారిని శనివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ కర్ల వెంకటనారాయణ ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం బోయపాటి శ్రీను స్థానిక విలేకరులతో మాట్లాడారు. గతంలో ‘సరైనోడు’ సినిమా షూటింగ్‌కు ముందు అమ్మవారిని దర్శించుకున్నానని, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందన్నారు. అలాగే, ఈనెల 16వ తేదీ నుంచి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, దానికి సంబంధించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్, హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారని తెలిపారు. గతంలో భద్ర, తులసి, దమ్ము, సింహా, లెజెండ్, సరైనోడు సినిమాలు తీశానని, ఇప్పుడు తీయబోయేది ఏడో సినిమా అని పేర్కొన్నారు. ద్వారకా క్రియేషన్స్ రవీంద్రరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.