గల్లంతయిన బాబి అలియాస్ అనురాగ్, జగదీష్(ఫైల్)
శ్రీకాళహస్తి రూరల్ :
రామాపురం రిజర్వాయర్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శ్రీకాళహస్తి సీఐ సుదర్శన్ ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి భనానీ నగర్‌కు చెందిన బాబి అలియాస్ అనురాగ్(23)కు కేవీబీపురం మండలం తిమ్మసముద్రం సమీపంలో పొలం ఉంది. ఈ క్రమంలో గురువారం రాత్రి అతను తన స్నేహితులు భవానీనగర్‌కు చెందిన రోహిత్(24), సంగ్‌సంగ్(23), చెన్నారెడ్డికాలనీకి చెందిన జగదీష్(23), సందీప్(23), సప్తగిరినగర్‌కు చెందిన ప్రదీప్(23)తో కలిసి తిమ్మసముద్రంలోని పొలం వద్దకు చేరుకున్నారు. రాత్రి అక్కడ ఆనందంగా గడిపారు. శుక్రవారం సాయంత్రం బొలెరో వాహనంలో రామాపురం రిజర్వాయర్ వద్దకు ఈతకొట్టేందుకు వెళ్లారు. ఒక్కొక్కరుగా రిజర్వాయర్ నీటిలో దిగారు. వీరిలో ఎవరికీ ఈత రాదు. జగదీష్, బాబి అలియాస్ అనురాగ్ లోతైన గుంతలోకి వెళ్లి మునిగిపోయారు. మిగిలిన యువకులు ఒడ్డుకు చేరి కేకలు వేశారు. వీరంతా ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చీకటి పడటంతో గాలింపుచర్యలకు సాధ్యం కావడం లేదున్నారు. శనివారం తెల్లవారుజామున ఈతగాళ్లను దింపి గాలింపుచర్యలు చేపడుతామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.