శ్రీశైలంలో బ్రహ్మోత్సవ కళ
శ్రీశైలంలో బ్రహ్మోత్సవ కళ
Published Wed, Feb 15 2017 9:53 PM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM
- శివదీక్ష శిబిరాలకు తరలివెళ్లిన ఉత్సవమూర్తులు
- 21వరకు జ్యోతిర్ముడి స్వాములకు మల్లన్న స్పర్శదర్శనం
శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలో్ల శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీశైలమల్లన్న దేవేరి భ్రామరితో కలిసి బుధవారం ఉదయం పల్లకీలో ఊరేగుతూ శివదీక్ష శిబిరాలకు తరలివెళ్లారు. ముందుగా శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో కూర్చోబెట్టి శాస్త్రోక్తపూజలు నిర్వహించారు. ఆలయ ప్రదక్షిణానంతరం స్వామిఅమ్మవార్లను ప్రధాన పురవీధిగుండా ఊరేగిస్తూ శివదీక్ష శిబిరాలకు తీసుకెళ్లారు.
స్వామివార్ల రాకతో దీక్ష శిబిరాలకు ఉత్సవ కళ వచ్చింది. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించి ఉత్సవమూర్తులను మండపంలో వేంచేయింపజేసి కర్పూర నీరాజనాలు అర్పించారు. అనంతరం శివదీక్ష స్వాములు ఇరుముడి ద్రవ్యాలను సమర్పించే హోమగుండానికి అగ్ని ప్రతిష్టాపన పూజలు చేసి వెలిగించారు. దీక్ష విరమణ చేసే భక్తులంతా శ్రీస్వామివారికి జ్యోతిర్ముడిని సమర్పించిన అనంతరం ఆవునెయ్యి, నారికేళం తదితర ద్రవ్యాలను హోమగుండంలో ఆహూతిగా సమర్పించారు.
21వరకు జ్యోతిర్ముడి స్వాములకు మల్లన్న స్పర్శదర్శనం
జ్యోతిర్ముడితో వచ్చే శివస్వాములకు ఈ నెల 21 వరకు మల్లికార్జున స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేక విధులపై సిబ్బందిని నియమించామని చెప్పారు. వేదపండితులు, దేవస్థానం ఆగమ పాఠశాల విద్యార్థులు, భక్తుల చేత జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం చేపడతారన్నారు. శివదీక్షా స్వాముల కోసం ఈ ఏడాది చంద్రావతి కల్యాణ మండపం నుంచి క్యూ ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. మార్చి 1 వరకు జ్యోతిర్ముడి సమర్పణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాయలసీమ జోన్ ఐజీ శ్రీధరరావు, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, పోలీస్ అధికారులు, దేవస్థానం సిబ్బంది, శివదీక్షా స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
Advertisement