భక్తులను కాపడేందుకు శ్రీశైలంలో భ్రమరాంబ కొలువు
శ్రీశైలం: భక్తులను కాపాడేందుకే శ్రీశైలభ్రమరాంబాదేవి అష్టాదశ శక్తిపీఠంగా కొలువు తీరిందనిప్రముఖ ప్రవచకులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శనివారం సాయంత్రం దివ్యపరిమళ పుష్పార్చనపై ప్రవచనాలను వినిపించారు. కార్యక్రమానికి ముందుగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు, దేవస్థానం ఈఓ నారాయణ భరత్ గుప్త, వేదపండితులు, అర్చకులు జ్యోతిప్రజ్వలన చేసి చాగంటి కోటేశ్వరరావును పుష్పాలంకతులను చేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ దంపతులు, భక్తులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఆ తరువాత చాగంటి ప్రవచనాలను వినిపిస్తూ స్వచ్ఛమైన భక్తులో ఉన్న భక్తిని, పద్మంలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదగా భ్రామరి భక్తుల్లో ఉన్న భక్తిని ఆస్వాదిస్తుందని చెప్పారు. అమ్మవారిని తొలుతగా నమస్కరించేది గంగాదేవి అని, ఆ గంగా ఇక్కడ పాతాళగంగగా శ్రీస్వామిఅమ్మవార్లను ఆరాధిస్తుందన్నారు. అటువంటి మహత్తర నదీకి పుష్కరాలు రాబోతున్నాయని, కృష్ణవేణీ నదీ త్రిమూర్తు స్వరూపమన్నారు.