బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి
డోన్ టౌన్: డోన్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి అనుచరులు చేస్తున్న అరాచకాలపై ఆయన మౌనం వీడాలని పీఏసీ చైర్మన్ బుగ్గన డిమాండ్ చేశారు. ఆదివారం తన స్వగృహంలో బుగ్గన డోన్ జెడ్పీటీసీ శ్రీరాములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ వేలాల సందర్భంగా శుక్రవారం టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారు బీసీలు కాదా అని కేఈని నిలదీశారు. బీసీలకు పెద్దదిక్కుగా చెప్పుకుంటున్న కేఈ బీసీలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం దారుణమన్నారు. అధికారపార్టీ ముసుగులో కొందరు పట్టణంలోని ప్రధానమైన వనరులను కొల్లగొడుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. ఆర్యవైశ్యులకు చెందిన విలువైన స్థలాలను కబ్జాచేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఏకపక్షంగా టెండర్లను దక్కించుకునేందుకే అధికార పార్టీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కేఈ కృష్ణమూర్తి తమ అనుచరులను అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ఏదో ఒక రోజు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.