టీడీపీ కోటకు బీటలు | breakage to tdp fort | Sakshi
Sakshi News home page

టీడీపీ కోటకు బీటలు

Published Tue, Feb 14 2017 9:46 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీ కోటకు బీటలు - Sakshi

టీడీపీ కోటకు బీటలు

నేడు వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్న గంగుల
- పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో నిర్ణయం
- ఆళ్లగడ్డలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ
- వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని కార్యకర్తల మండిపాటు
 
ఆళ్లగడ్డ: టీడీపీ ద్వంద్వ వైఖరితో కేడర్‌లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆళ్లగడ్డలో రాజకీయంగా బలమైన గంగుల కుటుంబం టీడీపీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా గత మంగళవారం రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల మండలాలు.. బుధవారం ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలు.. గురువారం ఆళ్లగడ్డ నగర పంచాయతీ, రూరల్‌ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గుంగుల కుటుంబ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.
 
తాజాగా మంగళవారం స్థానిక మహాలక్ష్మి కల్యాణ మండపంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల నాయకులు మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయత లేని తెలుగుదేశం పార్టీలో ఉండలేమని.. తామంతా మీ వెంటే ఉంటామని ముక్తకంఠంతో చెప్పారు. ఎన్ని కష్టనష్టాలైనా ఎదుర్కొంటామని.. ముందుండి నడిపిస్తే టీడీపీకి తగిన బుద్ధి చెబుతామన్నారు.
 
అడుగడుగునా అవమానాలే..
నియోజకవర్గంలో రెండు విడతల ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అలాంటి సమయంలో గంగుల ప్రభాకర్‌రెడ్డి పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 ఎంపీటీసీ, మూడు జెడ్పీటీసీ స్థానాలతో పాటు మూడు మండలాల్లో ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగలిగారు.
 
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిపాలైనా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. అయితే పార్టీలోకి వలస నేతల రాకతో గంగుల కుటుంబాన్ని చంద్రబాబు దూరం పెట్టడం మొదలైంది. ఆయన వర్గానికి ఎలాంటి పనులు దక్కకుండా మరో వర్గం అడ్డుకోవడం.. కనీసం ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రొటోకాల్‌ లేకపోవడం ఆ కుటుంబాన్ని బాధించింది. భూమా వర్గానికి చెందిన ఓడిపోయిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తుండటాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మూడు నెలల నుంచి కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం గంగులను మనస్థాపానికి గురిచేసింది.
 
వలస నేతలకే బాబు మద్దతు
గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు నాని ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలుస్తూ వచ్చారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులొచ్చినా తామున్నామంటూ భరోసానిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన నేతలకు అధిక ప్రాధాన్యతనిస్తూ మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి, ఎన్టీఆర్‌ గృహాలు, పింఛన్లకు లబ్ధిదారుల ఎంపికలో ఆ వర్గానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం గంగుల కుటుంబాన్ని ఆలోచనలో పడేసింది. మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా గంగుల వర్గానికి చెందిన రాఘవరెడ్డి పేరు ఖరారయిందని.. రేపోమాపో ప్రకటన వస్తుందన్న తరుణంలో భూమా వర్గానికి చెందిన బి.వి.రామిరెడ్డి పేరును ప్రకటించడం గంగుల కుటుంబం పార్టీ వీడేందుకు కారణమైంది. ఏదేమైనా రాజకీయాల్లో తల పండిన గంగుల కుటుంబం వైఎస్‌ఆర్‌సీపీలో చేరనుండటంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌లోనూ ఆ ప్రభావం కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement