లంచం కావాలంటే నేనే ఇస్తా
లంచం కావాలంటే నేనే ఇస్తా
Published Fri, Sep 2 2016 12:29 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు సిటీ : ‘జిల్లాలో ఏ అధికారి, ఉద్యోగికైనా లంచం కావాలంటే నేనే ఇస్తా.. తెల్లారితే ఉద్యోగం ఖాళీ చేయిస్తా.. అన్న వాస్తవాన్ని గుర్తించి లంచం అడగాలని’ కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ ప్రగతి తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కింద డ్వాక్రా సంఘాలకు బిల్స్ పెండింగ్ లేకుండా త్వరగా చెల్లింపులు జరగాలని, ట్రెజరీల్లో బిల్లులు చెల్లింపులో లంచాలడిగితే కాదనవద్దని వారు ఎంత లంచం కావాలన్నా తన దగ్గరకు వస్తే సొంత డబ్బులు ఇస్తానని ఆ డబ్బు తీసుకువెళ్లి లంచం అడిగిన వ్యక్తికి Sఇచ్చి ముందు ప్రజలు బాధపడకుండా బిల్లులు మంజూరు చేయించాలని, తెల్లారిన తరువాత లంచం తీసుకున్న వ్యక్తి ఆ రోజు నుంచి ఉద్యోగంలో ఉండబోడని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం వేలాది రూపాయలు జీతాలిస్తుంటే ఇంకా పై డబ్బులు కావాలా? చేసే పనికి ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నప్పుడు లంచాలు ఎందుకు కావాలని ప్రశ్నించారు. నా జీతం రూ.78 వేలని, నా కంటే రెట్టింపు జీతం తీసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారని, కానీ కలెక్టరంటే అందరికన్నా ఎక్కువ జీతం ఉంటుందనే భావన చాలా మందిలో ఉందన్నారు. కానీ వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరు చేరినా నిబంధనల మేరకు అందరికీ జీతాలు వర్తిస్తాయన్నారు. అంతే తప్ప జిల్లా కలెక్టరంటే నెలకు రూ.10 లక్షలు జీతం వస్తుందనే అపోహ ఉంటుందన్నారు. ప్రైవేట్ రంగంలో తక్కువ జీతాలు పొందుతూ ఎక్కువ పనిచేసే వారిని ఆదర్శంగా తీసుకుని పని సంస్కృతిని పెంచుకోవాలని కలెక్టర్ ఉద్యోగులకు హితవు పలికారు. ప్రతి నెలా ఆఖరి శుక్రవారం ప్రతి పాఠశాలలోనూ తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాన్ని నిర్వహించాలని చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో 3,316 పాఠశాలల్లో 1,509 పాఠశాలల్లో మాత్రమే తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారని 50 శాతంపైగా పాఠశాలల్లో ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదని కలెక్టర్ డీఈవోను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు పనిచేయాల్సిందేనని ఎవరైనా పని భారం ఉందని భావిస్తే మరో ఉద్యోగం చూసుకోవడం మంచిదని అంతేతప్ప రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసినా, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా సహించబోమని భాస్కర్ స్పష్టం చేశారు. 10వ తేదీ నుంచి కంప్యూటర్ విద్య తిరిగి ప్రారంభించి చిన్నారుల్లో కంప్యూటర్‌పై సరైన అవగాహన పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఈవో డి.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి, హౌసింగ్ పీడీ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement