ప్రేమ వివాహం.. స్నేహితుడి కిడ్నాప్
హైదరాబాద్: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయిల ప్రేమ వ్యవహారంలో మరో అబ్బాయి కిడ్నాప్‌నకు గురైన ఉదంతం హబీబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం రాత్రి హబీబ్‌నగర్‌లోని కురుమబస్తీలో కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్ మధుకర్‌స్వామి తెలిపిన వివరాల ప్రకారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహావీర్ ఆస్పత్రి సమీపంలోని ఓ బస్తీలో నాగరాజు అనే యువకుడు అదే బస్తీకి చెందిన ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి పెద్దలకు చెప్పకుండా ఉడాయించారు. దీంతో ఏసీ గార్డ్స్ బస్తీకి చెందిన 40 మంది ముస్లిం యువకులు పరారైన ఇరువురి కోసం గాలించారు.
ఎక్కడ గాలించినా కనిపించకపోవడంతో హబీబ్‌నగర్ కురుమస్తీలో ఉండే నాగరాజు స్నేహితుడైన చంద్రకిరణ్ ఇంటిపై దాడిచేశారు. ప్రేమికులిద్దరూ ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ చితకబాదారు. అంతటితో ఆగకుండా అతడిని కార్‌లో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. చంద్రకిరణ్ బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు హబీబ్‌నగర్ పోలీసులు వెంటనే స్పందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆ యువకులు పలాయనం చిత్తగించారు.
ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని ఓ బృందం రాత్రంతా శ్రమించి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇంటిలో చంద్రకిరణ్‌ను బంధించినట్లు తెలుసుకున్నారు. నిందితుల్లో ఇమ్రాన్, చోటు, అఫ్జల్ ప్రధాన సూత్రధారులని గుర్తించారు. వెంటనే దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకొని ఇంటిపై దాడిచేసిన పోలీసులు చంద్రకిరణ్‌ను అదుపులోకి తీసుకోగా, కిడ్నాప్ చేసిన యువకులందరూ పరారయ్యారు. పరారైనవారి కోసం పోలీసులు వేట కొనసాగించారు.