ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఇటీవలే వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. టెన్నిస్ క్రీడాకారిణి హిమానీ మోర్(Himani Mor)తో జనవరి 16న అతడి పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నీరజ్ షేర్ చేసిన తర్వాతే.. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.
ఈ నేపథ్యంలో నీరజ్ భార్య హిమానీ మోర్ బ్యాగ్రౌండ్‌తో పాటు.. అత్తామామల నుంచి అతడు తీసుకున్న కట్నకానుకలు, అల్లుడిగా అందుకున్న బహుమతులు ఏమిటన్న అంశాల గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నీరజ్‌కు పిల్లనిచ్చిన అత్తామామలు చంద్ర మోర్, మీనా మోర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రేమ పెళ్లి
‘‘దేవుడి దయ వల్ల మా అమ్మాయికి మంచి భర్త దొరికాడు. దేశం మొత్తాన్ని గర్వింపజేసిన వ్యక్తితో నా కూతురి పెళ్లి కావడం సంతోషంగా ఉంది. నీరజ్, హిమానీలకు గత రెండేళ్లుగా పరిచయం ఉంది. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఇరు కుటుంబాల అనుమతితోనే పెళ్లి చేసుకున్నారు’’ అని మీనా మోర్ దైనిక్ భాస్కర్‌కు తెలిపారు.
‘కట్నకానుకలు’ ఎంతో తెలుసా?
అదే విధంగా.. తమ అల్లుడు తమ నుంచి కట్నంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడని హిమానీ తల్లిదండ్రులు వెల్లడించారు. ఇది కాకుండా ఎలాంటి కట్నం, కానుకలు, బహుమతులు.. ఆఖరికి పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఇచ్చే వస్తువులు, దుస్తులను కూడా స్వీకరించలేదని తెలిపారు. తమ కూతురిని అచ్చంగా వాళ్లింటి అమ్మాయిని చేసుకున్నారని సంతోషంతో పొంగిపోయారు.
కాగా హర్యానా అథ్లెట్లు నీరజ్- హిమానీల వివాహం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఇక ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా జనవరి 14న నిశ్చితార్థం జరుగగా.. జనవరి 15న హల్దీ, మెహందీ, సంగీత్ నిర్వహించారు. జనవరి 16 మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తికాగా.. సాయంత్రం అప్పగింతల కార్యక్రమం జరిగింది. కేవలం అరవై మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరగడం విశేషం. ఇక కొత్త జంట ఇప్పటికే హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఎవరీ హిమానీ మోర్?
హర్యానాలోని లార్సౌలీ హిమానీ స్వస్థలం. సోనిపట్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అండ్‌ఫిజికల్ సైన్స్‌లో పట్టా పుచ్చుకుంది. ఉన్నత విద్యనభ్యసించేందుకు హిమానీ అమెరికాకు వెళ్లింది.
ప్రస్తుతం హిమానీ మెక్‌కోర్మాక్ ఐసెంబర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2018లో హిమానీ ఆలిండియా టెన్సిస్ అసోసియేషన్ ఈవెంట్లలో పాల్గొనడం ప్రారంభించింది. కెరీర్‌లో ఉత్తమంగా సింగిల్స్ విభాగంలో 42వ, డబుల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించింది.
నికర ఆస్తుల విలువ?
కాగా హర్యానాలోని పానిపట్ జిల్లాలో గల ఖాంద్రా గ్రామంలో నీరజ్ చోప్రా ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. గతంలో ఆర్మీ సుబేదార్‌గా పనిచేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా.. ‘గోల్డెన్ బాయ్’గా ప్రసిద్ధి పొందాడు.
ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం నీరజ్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నీరజ్ నికర ఆస్తుల విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.
చదవండి: ‘నా కుమారుడిపై పగబట్టారు.. కావాలనే తొక్కేస్తున్నారు’
Comments
Please login to add a commentAdd a comment