ఏపీ, తెలంగాణ జిల్లాలను కలిపే వంతెనలు
నడిగడ్డ చుట్టూ కృష్ణా,
తుంగభద్ర జీవనదులు
జోగుళాంబ గద్వాల జిల్లాకు
రాకపోకలకు ఇవే ప్రధానం
వ్యాపారం, బంధుత్వాల
పరంగా కీలక భూమిక
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాకు ఇతర ప్రాంతాలతో ఉన్న అనుబంధాన్ని ప్రధాన వారధులు కలుపుతున్నాయి. ఇటు తెలంగాణ.. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు విద్య, వ్యాపార, బంధుత్వాలను కలిపేందుకు ఈ వంతెనలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి.. ఏ ప్రాంతంలోనైనా ఒకటిరెండు వారధులు ఉండడం సహజం. కానీ జోగుళాంబ గద్వాల జిల్లా చుట్టూ ఆరు వారధులు ఉన్నాయి. కృష్ణానదిపైనే రెండు ప్రధాన వంతెనలు నిర్మించారు. రాష్ట్రంలోని ఇతరప్రాంతాలతో పోల్చితే నడిగడ్డకు వెళ్లాలంటే మాత్రం ఈ భారీ వారధులను దాటాల్సిందే. మాతృ జిల్లా మహబూబ్‌నగర్ సువిశాలంగా ఉండడంతో ఈ వంతెనలకు పెద్దగా గుర్తింపురాలేదు. కానీ జోగుళాంబ గద్వాల జిల్లా ఆవిర్భవించిన తర్వాత ప్రాంతాలను కలుపుతున్న వారధుల గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. జిల్లాల పునర్విభజనలో అలంపూర్, గద్వాలకురాష్ట్రస్థాయిలో ప్రత్యేకగుర్తింపు లభిం చింది. గద్వాలకు నియోజకవర్గాన్ని ఆనుకునే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అలంపూర్ నియోజకవర్గంలో మాత్రం కృ ష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా యి. ఈ రెండు నదుల సంక్షేమక్షేత్రం కూడా అలంపూర్‌లోనే ఉండడం మరో విశేషంగా చెప్పొచ్చు.. దేశంలోని అతి పొడవైన 44వ నంబర్ జాతీయ ర హదారిపై బీచుపల్లి వద్ద నిర్మించిన వంతెన ఇతర ప్రాంతాలతో రాకపోకలు సాగించేందుకు దోహదపడుతోంది.
ప్రధాన వారధులు ఇవే..
∙ఇటిక్యాల మండలం బీచుపల్లి క్షేత్రం వద్ద 44వ జాతీయరహదారిలోని కృష్ణానదిపై వారధి నిర్మించారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టు బ్రిడ్జి రాకపోకలకు అనువుగా ఉంది. ఈ రెండు వారధుల ద్వారా గద్వాల, వనపర్తి జిల్లాలోని గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. బీచుపల్లి వద్ద ఉన్న వారధి పైనుంచి దేశవ్యాప్తంగా ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.
∙అలంపూర్ నియోజకవర్గంలోని పుల్లూరు వద్ద తుం గభద్ర వారధి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతోంది. వీటితోపాటు జాతీయరహదారి కావడంతో ఇతరరాష్ట్రాల ప్రజలకు రవాణా సౌలభ్యం కల్పిస్తోంది.
∙అలాగే అంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలం నాగుల్‌దిన్నె బ్రిడ్జి తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను కలుపుతోంది.
∙వడ్డేపల్లి మండలంలోని రాజోలి వద్ద సుంకేసుల బ్యారేజీపై నిర్మించిన వారధి పైనుంచి ఆంధ్రప్రదేశ్– తెలంగాణ జిల్లాల గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.
∙అలంపూర్ మండలంలోని అలంపూర్– ర్యాలంపాడు గ్రామాల మధ్య ఉన్న తుంగభద్రపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇలా జోగుళాంబ గద్వాల జిల్లాకు రాకపోకలు సాగించేందుకు ఈ వారధులే కీలకంగా మారనున్నాయి. అయితే వీటిలో అలంపూర్– ర్యాలంపాడు గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి, అయిజ మండలం నాగుల్‌దిన్నె వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణదశలో ఉన్నాయి.
విద్య, వ్యాపారపరంగా..
గద్వాల, అలంపూర్ వాసులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిరాష్ట్రంలో ఉన్నత విద్యపరంగా ఎక్కువగా కర్నూలుపైనే ఆధారపడేవారు. ఇక్కడే విద్యాసంస్థలు అనేకం ఉండడంతో 80శాతం మంది విద్యార్థులు చదువులు సాగించేవారు. అలాగే చాలామంది వనపర్తికి ఉన్నత చదువులకు వెళ్లేవారు. బంధుత్వాలపరంగా ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్, ఆంధ్రలోని కర్నూలు, నందికొట్కూరు, ఆధోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలకు బంధుత్వాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు నాగల్‌దిన్నె, సుంకేసుల, తుంగభద్ర వారధుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే వ్యాపారపరంగా ఏ చిన్న వస్తువు కావాలన్నా కర్నూలుకు వెళ్తారు. యంత్రాల విడిభాగాలు, ఇంటినిర్మాణ సామగ్రి, కిరాణ వస్తువులు, వస్త్రాలు తదితర వాటికి ఇక్కడినుంచే కొనుగోలుచేస్తారు. జోగుళాంబ, జములమ్మను దర్శించుకునేందుకు వస్తారు. ఇలా ఈ వారధులు జోగుళాంబ గద్వాల జిల్లాకు మణిహారంగా మారనున్నాయి.