విరిగిపడిన మట్టిచరియలు
విరిగిపడిన మట్టిచరియలు
Published Sat, May 27 2017 10:07 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
ఒకరి మృతి, నలుగురికి గాయాలు
తుని : కూలీ పనికి వెళితే నాలుగు రాళ్లు సంపాదించుకుందామని ఇంటి నుంచి తెల్లవారుజామున వెళ్లి మట్టిలో కలిసిపోయాడు. పనికి వెళితే పూట గడవని కూలీలు చెరువులో మట్టి తవ్వుతుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. తుని రూరల్ ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం చిన్న నరసాపురంకు చెందిన ఐదుగురు, తుని పట్టణం రామకృష్ణాకాలనీకి చెందిన ఒకరు ట్రాక్టరు పనికి శనివారం తెల్లవారుజామున వెళ్లారు. తుని మండలం వి.కొత్తూరు పెద్దచెరువులో వీరు మట్టి తవ్వుతుండగా ఒక్కసారిగా పైన ఉన్న చరియలు విరిగిపడిపోయాయి. మట్టికింద చిక్కుకు పోయిన మాసా పాపారావు, జెక్కల సత్యనారాయణ, వై.సింహాచలం, వంతాడ అప్పన్నలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మట్టిలో కూరుకుపోయిన జెక్కల నాగబాబు (45) మృతి చెందాడు. గాయపడిన వారిని తుని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతిచెందిన నాగబాబును సంఘటనా స్థలం నుంచి నేరుగా నరసాపురానికి తీసుకుపోయారు. జరిగినది ప్రమాదం కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లమని గ్రామస్తులు చెప్పడంతో ఉదయం 10 గంటలకు తీసుకువచ్చారు. మృతుడు నాగబాబుకు భార్య కరుణ, నలుగురు పిల్లలు ఉన్నారు. దీంతో బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
సంఘటనా స్థలం పరిశీలన
మట్టి చరియలు పడి ప్రమాదం జరిగిన పెద్ద చెరువును రూరల్ ఎస్సై ఆశోక్ పరిశీలించారు. చెరువు గర్భంలో మెత్తటి మట్టి ఉన్న చోట లోతుగా తవ్వడంతో ప్రమాదం జరిగిందన్నారు. నీరూ చెట్టు పథకంలో ఇటీవల పనులు చేశారని స్థానికులు చెప్పడంతో తహసీల్దార్ సూర్యనారాయణకు సమచారం ఇచ్చారు. ప్రస్తుతం మట్టి తవ్విన ప్రాంతానికి అనుమతులు లేన ట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రెవెన్యూ అధికారుల విచారణ చేసిన తర్వాత కాంట్రాక్టరుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో మట్టిని తరలిస్తున్న సదరు కాంట్రాక్టరు పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మట్టిని తరలించడానికి ఉపయోగించిన ట్రాక్టరును సీజ్ చేశామని ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement