మరణంలోనూ వీడని బంధం
విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతున్న కారు అతివేగంగా వచ్చి నిడదవోలు మండలం తాళ్లపాలెం వద్ద చెట్టును ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకులైన అన్నదమ్ములు కంబాల గోపిచంద్ (23), కంబాల సాయిరామ్ (20) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
అన్నదమ్ముల దుర్మరణం
చెట్టును ఢీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు
నిడదవోలు మండలం తాళ్లపాలెంలో ఘటన
విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతుండగా ప్రమాదం
నిడదవోలు రూరల్ : విజయవాడ నుంచి రాజమండ్రి వెళుతున్న కారు అతివేగంగా వచ్చి నిడదవోలు మండలం తాళ్లపాలెం వద్ద చెట్టును ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకులైన అన్నదమ్ములు కంబాల గోపిచంద్ (23), కంబాల సాయిరామ్ (20) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నిడదవోలు పట్టణ ఎస్సై జి.సతీష్ కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన కంబాల శ్రీనివాసరెడ్డి డాల్ఫిన్ ఎలక్ట్రానిక్స్ (ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ కేంద్రం) నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు పెద్దవాడు గోపిచంద్ బీటెక్ పూర్తిచేయగా చిన్న కుమారుడు సాయిరామ్ పాలిటెక్నిక్ పూర్తిచేసి ఇంజినీరింగ్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరూ ఆదివారం వేకుజామున 4 గంటల సమయంలో ఇంటి నుంచి ఏపీ 16 ఈఎఫ్ 0209 మారుతి సుజికీ ఈకో కారులో సుమారు 25 ఎల్‌ఈడీ టీవీలతో రాజమండ్రికి బయలుదేరారు. ఉదయం 8 గంటల సమయంలో మార్గమధ్యంలో నిడదవోలు మండలం తాళ్లపాలెంలో వేగంగా వస్తూ రాళ్ల గుట్టను తాకుతూ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టారు. దీంతో కారు కాలువలోకి దూసుకుపోయింది. ఈ సమీపంలో ఉన్న వీరమల్లు త్రిమూర్తులు, కట్రెడ్డి ఉమామహేశ్వరరావు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో కొందరు యువకులు కాలువలోకి దూకి అగ్నిమాపక సిబ్బంది సహకారంతో కారుని బయటకు తీశారు. అప్పటికే తీవ్రగాయాలతో కారులో ఇరుక్కుపోయి వీరిద్దరూ మృతిచెందారు. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, అగ్నిమాపకాధికారి జె.శ్రీనివాసరెడ్డి సిబ్బంది సాయంతో కారులో మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి విజయవాడ బంధువులకు సమాచారం అందజేశారు.
తండ్రి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిలో ఉండటంతో..
ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ షాపు నిర్వహించే కంబాల శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. వారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. తల్లి శ్రీవాణి భర్తకు సపర్యాలు చేస్తుండగా, కుమారులిద్దరూ ఎల్‌ఈడీ టీవీలు రాజమండ్రి ఇచ్చి వెళ్లిపోదామని కారులో బయలుదేరారు. తమ్ముడు సాయిరామ్‌కు డ్రైవింగ్ రావడంతో అతడే కారు నడుపుతుండగా పక్కసీటులో గోపిచంద్ కూర్చున్నాడు. గతంలో ఇలా కారులో రెండుసార్లు రాజమండ్రి వచ్చి ఎల్‌ఈడీ టీవీలు అందజేశారని అక్కడ వ్యాపారి కె.శ్రీనివాసరావు అన్నారు. ఇద్దరు కుమారులు మృతిచెందారని తెలిస్తే తండ్రి శ్రీనివాసరెడ్డి కూడా దక్కడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలు ప్రభుత్వాస్పత్రి వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.