రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచిన బడ్జెట్
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పూర్తిగా నిరాశ పరిచిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందనే ధ్యాస గానీ, ఆదుకోవాలనే ఉద్దేశం గాని టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు. ఐదుకోట్ల ఆంధ్రులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై, విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీలపై బడ్జెట్‌లో కనీసం ప్రస్థావన కూడా రాకపోవడం సిగ్గుచేటన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశలు కల్పించి, చివరికి నట్టేట ముంచారని విచారం వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి వారి చెవిలో పూలు పెడుతున్నారన్నారు. రైతుకు పూర్తిగా నిరాశ కల్గించిన బడ్జెట్‌గా అభివర్ణించారు.