అర్ధరాత్రి అరణ్యరోదన
- కుప్పకూలిన పాత మిద్దె
– శిథిలాల కింద ఆటోడ్రైవర్ దుర్మరణం
– గాయాలతో బయటపడిన తల్లి
అనంతపురం సెంట్రల్: గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు.. ఎడతెరపిలేని జోరువాన.. కుప్ప కూలిన పాత మిద్దె పైకప్పు.. కాపాడాలంటూ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అరణ్యరోదనే అయ్యాయి. శిథిలాల కింద ఆటోడ్రైవర్ దురణం చెందాడు. తల్లి గాయాలతో బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని నాల్గవరోడ్డుకు చెందిన రమేష్‌బాబు(35) ఆటో డ్రైవర్. ఈయనకు తల్లి రామక్క, భార్య మీనాక్షి, కుమారులు మణికంఠ, బన్ని ఉన్నారు. సంపాదన అంతంతమాత్రంగానే ఉండటంతో కొత్త ఇల్లు కట్టుకోలేక, అద్దె ఇల్లు తీసుకోలేక పాత మిద్దెలో నివాసం ఉంటున్నారు.
వర్షం వచ్చినప్పుడల్లా ఇల్లు కారుతుంటుంది. గురువారం రాత్రి వర్షం మొదలవడంతో భార్య, పిల్లలను దగ్గర్లోని బంధువుల ఇంటికి పంపించాడు. తల్లి రామక్కతో కలిసి రమేష్‌బాబు ఇంట్లోనే నిద్రపోయాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జోరువాన దెబ్బకు ఇంటి పైకప్పు కుప్పకూలింది. శిథిలాల కింద రమేష్ ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందాడు. రామక్క స్వల్పగాయాలతో బయటపడింది. పైకప్పు కూలే సమయంలో భారీ శబ్దం రావడంతో పొరుగున నివాసముంటున్న వారంతా ఉలిక్కి పడి లేచారు. ఏం జరిగిందని తెలుసుకోవడానికే సమయం పట్టింది.
అంతలో భార్య, పిల్లలు అక్కడికి చేరుకున్నారు. శిథిలాల కింద భర్త, అత్త ఉన్నారని చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన రమేష్‌బాబును హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్‌బాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రామక్క స్వల్ప గాయాలతో బయటపడింది. ముందుచూపుతో భార్య, పిల్లలను బంధువుల ఇంటికి పంపించకపోతే ప్రాణనష్టం ఎక్కువగా జరిగేదని స్థానికులు పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం:
విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి రూ. 50 వేలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్ హిమబిందు రూ. 5 వేల ఆర్థికసాయాన్ని అందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.