చిన్నారిని చిదిమేసిన బస్సు | Bus accident killed the child | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన బస్సు

Published Mon, Nov 9 2015 4:46 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

చిన్నారిని చిదిమేసిన బస్సు - Sakshi

చిన్నారిని చిదిమేసిన బస్సు

♦ దీపావళి షాపింగ్‌కు వెళుతుండగా విషాదం
♦ సిగ్నల్ వద్ద బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
♦ మరో బస్సు కింద పడి బాలుడు మృతి
 
 హైదరాబాద్: వెలుగులు కురి పించే దీపావళి ఆ ఇంట చీకట్లు చిమ్మింది. పండుగ షాపింగ్‌కు బయలుదేరిన కుటుంబం కంటిపాపను చిదిమేసి విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళుతున్న వారిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. పక్కనే వస్తున్న మరో ఆర్టీసీ బస్సు కిందపడి బాలుడు బలయ్యాడు. మిగిలినవారికి గాయాలైన ఈ హృదయవిదారక ఘటన ఆదివారం ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి... వనస్థలిపురం కమలానగర్‌లో ఉండే మిట్టంకంటి సత్యనారాయణరెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు పిల్లలు... దీపక్‌రెడ్డి(5), సౌమ్య(7). వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పహిల్మాన్‌పూర్.

ఆదివారం మధ్యాహ్నం భార్య, ఇద్దరు పిల్లలతో కలసి సత్యనారాయణరెడ్డి తన ద్విచక్ర వాహనం (ఏపీ10ఏఏ 8371)పై దీపావళి షాపింగ్‌కు బయలుదేరారు. దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళుతుండగా ఎల్‌బీనగర్ రింగురోడ్డు వద్ద సిగ్నల్ పడటంతో వాహనాన్ని ఆపారు. గ్రీన్ సిగ్నల్ పడగానే వెనకాల ఉన్న హయత్‌నగర్ డిపో-2 బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో వాహనం పైనున్న వారంతా కిందపడ్డారు. పక్కనే ఉన్న హయత్‌నగర్ డిపో-1 బస్సు చిన్నారి దీపక్‌రెడ్డి, సుజాత కాళ్లపై నుంచి వెళ్లింది. తలకు తీవ్ర గాయమైన దీపక్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. సత్యనారాయణరెడ్డి, సౌమ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్సనిమిత్తం మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి పండగ ముందు గుండె కోత మిగిల్చిన ఈ ఘటనతో సత్యనారాయణ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement