RTC bus collided
-
నెత్తురోడిన రహదారులు..రెండు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
సాక్షి, కంటోన్మెంట్: నగరంలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు నిర్మల్ నుంచి వచ్చిన వృద్ధ దంపతులు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన బోయిన్పల్లి చౌరాస్తాలో ఆదివారం చోటు చేసుకుంది.. నిర్మల్ నగరానికి చెందిన తులసీదాస్ (65), రాజమణి (62) దంపతులు నగరంలోని గచ్చిబౌలిలో ఉంటున్న తమ కుమారుడు రామరాజు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం నగరానికి వచ్చారు. మధ్యాహ్నం బోయిన్‌పల్లిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపునకు వెళ్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు బస్సు డ్రైవర్ మార్గం నరహరి అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుమారుడు రామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు బోయిన్పల్లి చౌరస్తాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆగ్రహించిన స్థానికులు పోలీసులు, అధికారులకు కనువిప్పు కలగాలంటూ ఓ పక్క అంబులెన్స్‌లో మృతదేహాలు, ఆర్టీసీ బస్సును చూపిస్తూ ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం కుషాయిగూడ: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుషాయిగూడ పీఎస్ పరిధిలోని మల్లాపూర్ అశోక్‌నగర్ కాలనీ మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన రాజు మహతో నగరానికి వలసవచ్చి మల్లాపూర్‌లోని న్యూ నర్సింహనగర్లో కుటుంబంతో సహా నివాసం ఉంటూ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం తోపుడుబండిపై ఉల్లిపాయలు విక్రయిస్తుండగా మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచి్చన కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి బావ నాగేందర్‌కుమార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి) -
కష్టపడి ఎస్ఐ అయ్యాడు.. పెళ్లయి కూడా 5 రోజులే.. విధుల్లో చేరేందుకు వెళ్తూ..
చింతపల్లి: కష్టపడి చదివి ఎస్ఐ ఉద్యోగం సాధించి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. 5 రోజు ల క్రితమే పెళ్లి అయ్యింది. ఉద్యోగంలో చేరి సాఫీగా జీవితం గడపాలనుకున్న అతడిని విధి వెక్కిరించింది. విధుల్లో చేరడానికి స్వ గ్రామం నుంచి తండ్రితో కలసి బయలుదేరగా.. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లిరాంనగర్ సమీపంలో సాగర్ హైవేపై శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్యతండాకు చెందిన నేనావత్ మాన్యనాయక్(50)ది వ్యవసాయ కుటుంబం. ఇతని కుమారుడు నేనావత్ శ్రీను(30) ఎస్ఐగా శిక్షణ పూర్తి చేసుకొని వికారాబాద్ టౌన్‌కు పోస్టింగ్ అందుకున్నా డు. శనివారం పలువురు కుటుంబసభ్యుల తో కలసి ఆటోలో మాన్యతండా నుం చి హైదరాబాద్‌కు తండ్రీకొడుకులు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పోలేపల్లిరాంనగర్ వద్ద ఆటోను ఢీకొట్టింది. శ్రీను, మాన్యనాయక్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, నాంపల్లి సీఐ సత్యం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, శ్రీనుకు వికారాబాద్ టౌన్ ఎస్ఐగా పోస్టింగ్ రావడంతో రిపోర్ట్ చేయాల్సి ఉంది. పెళ్లి తంతు ముగిసిన అనంతరం విధుల్లో చేరాలని భావించాడు. ఎస్ఐగా రిపోర్ట్ చేసేందుకు వెళ్తూనే మృతిచెందాడు. పెళ్లయిన ఐదు రోజులకే.. నేనావత్ శ్రీను వివాహం మాల్ వెంకటేశ్వరనగర్‌లో ఐదు రోజుల క్రితం జరిగింది. పోలీసు శాఖలో ఎస్ఐగా ఉద్యోగం సాధించడంతో కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలని పెళ్లి చేసుకున్నాడు. అంతలోనే మృత్యువు కబళించింది. -
కూకట్‌పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
-
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ అనుభవ రాహిత్యమై ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డ ప్రయాణికులు.. డ్రైవర్‌ను చితక్కొట్టారు. రెండు బస్సులు నడిరోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. -
ఆర్టీసీ బస్సు ఢీ : ఇద్దరి దుర్మరణం
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు యాక్టివాను ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన వనస్థలిపురం విష్ణు సినిమా థియేటర్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్టివాను ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య(50) అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ : బాలుడి మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ చిన్నారి మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన సాయి(13), శ్రవణ్(14) అనే ఇద్దరు స్నేహితులు సైకిల్‌పై వెళ్తుండగా.. కొత్తగూడెం నుంచి తళ్లాడ వైపు వెళ్తున్న మధిర డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో సాయి అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రవణ్ తీవ్రంగా గాయాపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. శ్రవణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
మృత్యు శకటం
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు పీజీ విద్యార్థినుల మృతి హైదరాబాద్: ఆర్టీసీ బస్సు మృత్యు శకటమై దూసుకొచ్చింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు పీజీ విద్యార్థినుల ప్రాణాలను నిలువునా బలితీసుకుంది. ముషీరాబాద్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి ఇరువురు యువకులు దుర్మరణం పాలై రెండు రోజులైనా గడవకముందే మరో విషాదం స్థానికులను కలచివేసింది. కవాడిగూడ ప్రాగాటూల్స్ సమీపంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. వివరాలివి... ఈసీఐఎల్ నాగారంలో నివసించే సుస్మితాశర్మ (23), సైనిక్‌పురీ జ్యోతినగర్ కాలనికి చెందిన హుస్నా రెజా(22) వెస్ట్‌మారేడుపల్లిలోని కస్తూర్బా కళాశాలలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. శనివారం దోమలగూడ ఏవీ కళాశాలలో ‘గ్లిట్జ్ 2కె 15’ ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ కోసం సుస్మిత స్కూటీపై ఇరువురూ బయలుదేరారు. ప్రాగాటూల్స్ వద్ద ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ నుంచి సెక్రటేరియట్‌కు వెళుతున్న చెంగిచర్ల డిపో ఆర్టీసీ బస్సు (రూట్ నం.15వై) వెనక నుంచి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో విద్యార్థినులు బస్సు కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన వారిని ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందారు. మరణంలోనూ స్నేహబంధాన్ని వీడని వీరిని చూసి కళాశాల సిబ్బంది, స్నేహితులు, విద్యార్థినుల తల్లిదండ్రులు విలపించారు. బస్సు డ్రైవర్ సత్తయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27న సుస్మిత పెళ్లి... ఇదిలావుంటే... మృతురాలు సుస్మితకు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 27న ముహూర్తం. శుక్రవారమే ఆమె తల్లిదండ్రులు ఫంక్షన్ హాల్‌కు అడ్వాన్స్ కూడా చెల్లించారు. ఇంతలోనే జరిగిన ఈ దారుణాన్ని తలచుకొని సుస్మిత తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యశర్మ, స్వర్ణలత దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాగా, పక్షవాతంతో మూడు నెలలపాటు సెలవులో ఉన్న బస్సు డ్రైవర్ సత్తయ్య గురువారమే తిరిగి విధుల్లో చేరాడు. రెండు రోజులకే ప్రమాదానికి కారణమయ్యాడు. అతడికి ఆర్టీసీ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు జరిపారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదానికి కొద్దిగా ముందు ఓ ఆటోను కూడా ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు తెలియని వైనం... హుస్నా రెజా తల్లిదండ్రులు సయ్యద్ అలీ రెజా, దీనత్ రెజాలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో బంధువులు వారికి కుమార్తె మరణవార్త విషయం చెప్పలేదు. దీంతో వారు ఇంకా కుమార్తె ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్నారు. -
చిన్నారిని చిదిమేసిన బస్సు
♦ దీపావళి షాపింగ్‌కు వెళుతుండగా విషాదం ♦ సిగ్నల్ వద్ద బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ♦ మరో బస్సు కింద పడి బాలుడు మృతి హైదరాబాద్: వెలుగులు కురి పించే దీపావళి ఆ ఇంట చీకట్లు చిమ్మింది. పండుగ షాపింగ్‌కు బయలుదేరిన కుటుంబం కంటిపాపను చిదిమేసి విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళుతున్న వారిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. పక్కనే వస్తున్న మరో ఆర్టీసీ బస్సు కిందపడి బాలుడు బలయ్యాడు. మిగిలినవారికి గాయాలైన ఈ హృదయవిదారక ఘటన ఆదివారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి... వనస్థలిపురం కమలానగర్లో ఉండే మిట్టంకంటి సత్యనారాయణరెడ్డి, సుజాత దంపతులకు ఇద్దరు పిల్లలు... దీపక్‌రెడ్డి(5), సౌమ్య(7). వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పహిల్మాన్‌పూర్. ఆదివారం మధ్యాహ్నం భార్య, ఇద్దరు పిల్లలతో కలసి సత్యనారాయణరెడ్డి తన ద్విచక్ర వాహనం (ఏపీ10ఏఏ 8371)పై దీపావళి షాపింగ్‌కు బయలుదేరారు. దిల్సుఖ్నగర్ వైపు వెళుతుండగా ఎల్బీనగర్ రింగురోడ్డు వద్ద సిగ్నల్ పడటంతో వాహనాన్ని ఆపారు. గ్రీన్ సిగ్నల్ పడగానే వెనకాల ఉన్న హయత్‌నగర్ డిపో-2 బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో వాహనం పైనున్న వారంతా కిందపడ్డారు. పక్కనే ఉన్న హయత్‌నగర్ డిపో-1 బస్సు చిన్నారి దీపక్‌రెడ్డి, సుజాత కాళ్లపై నుంచి వెళ్లింది. తలకు తీవ్ర గాయమైన దీపక్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. సత్యనారాయణరెడ్డి, సౌమ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్సనిమిత్తం మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి పండగ ముందు గుండె కోత మిగిల్చిన ఈ ఘటనతో సత్యనారాయణ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.