మృత్యు శకటం
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు పీజీ విద్యార్థినుల మృతి
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు మృత్యు శకటమై దూసుకొచ్చింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు పీజీ విద్యార్థినుల ప్రాణాలను నిలువునా బలితీసుకుంది. ముషీరాబాద్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి ఇరువురు యువకులు దుర్మరణం పాలై రెండు రోజులైనా గడవకముందే మరో విషాదం స్థానికులను కలచివేసింది. కవాడిగూడ ప్రాగాటూల్స్ సమీపంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. వివరాలివి... ఈసీఐఎల్ నాగారంలో నివసించే సుస్మితాశర్మ (23), సైనిక్‌పురీ జ్యోతినగర్ కాలనికి చెందిన హుస్నా రెజా(22) వెస్ట్‌మారేడుపల్లిలోని కస్తూర్బా కళాశాలలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. శనివారం దోమలగూడ ఏవీ కళాశాలలో ‘గ్లిట్జ్ 2కె 15’ ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ కోసం సుస్మిత స్కూటీపై ఇరువురూ బయలుదేరారు.
ప్రాగాటూల్స్ వద్ద ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ నుంచి సెక్రటేరియట్‌కు వెళుతున్న చెంగిచర్ల డిపో ఆర్టీసీ బస్సు (రూట్ నం.15వై) వెనక నుంచి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో విద్యార్థినులు బస్సు కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన వారిని ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందారు. మరణంలోనూ స్నేహబంధాన్ని వీడని వీరిని చూసి కళాశాల సిబ్బంది, స్నేహితులు, విద్యార్థినుల తల్లిదండ్రులు విలపించారు. బస్సు డ్రైవర్ సత్తయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
27న సుస్మిత పెళ్లి...
ఇదిలావుంటే... మృతురాలు సుస్మితకు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 27న ముహూర్తం. శుక్రవారమే ఆమె తల్లిదండ్రులు ఫంక్షన్ హాల్‌కు అడ్వాన్స్ కూడా చెల్లించారు. ఇంతలోనే జరిగిన ఈ దారుణాన్ని తలచుకొని సుస్మిత తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యశర్మ, స్వర్ణలత దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాగా, పక్షవాతంతో మూడు నెలలపాటు సెలవులో ఉన్న బస్సు డ్రైవర్ సత్తయ్య గురువారమే తిరిగి విధుల్లో చేరాడు. రెండు రోజులకే ప్రమాదానికి కారణమయ్యాడు. అతడికి ఆర్టీసీ అధికారులు ఫిట్‌నెస్ పరీక్షలు జరిపారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదానికి కొద్దిగా ముందు ఓ ఆటోను కూడా ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు.
తల్లిదండ్రులకు తెలియని వైనం...
హుస్నా రెజా తల్లిదండ్రులు సయ్యద్ అలీ రెజా, దీనత్ రెజాలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో బంధువులు వారికి కుమార్తె మరణవార్త విషయం చెప్పలేదు. దీంతో వారు ఇంకా కుమార్తె ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్నారు.