విశాల్ (ఫైల్), సుజిత్ (ఫైల్), ఘటనా స్థలంలో లభ్యమైన గంజాయి ప్యాకెట్
దుండిగల్: వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారి బైక్‌లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అనంత్ విశాల్(23), సుజిత్(21) బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు.
సుజిత్ స్థానికంగా ఉన్న మహాలక్ష్మీ బాయ్స్ హాస్టల్‌లో, విశాల్ మరో హాస్టల్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ శనివారం రాత్రి 11 గంటల సమయంలో యమహా బైక్‌పై సూరారం ప్రాంతానికి వచ్చారు. తిరిగి బహదూర్‌పల్లి వైపు వేగంగా వెళ్తుండగా సూరారం కట్టమైసమ్మ దేవాలయం సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విశాల్, సుజిత్ అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాల్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కొడిగిరి మండలం దోమలెడిగి కాగా, తండ్రి విఠల్ పటేల్ ఎంపీటీసీ. సుజిత్ స్వస్థలం మంచిర్యాల.
బైక్‌లో లభ్యమైన గంజాయి..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న ఎరుపు రంగు బ్యాగ్‌లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. మైసమ్మగూడలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు రాత్రి సమయంలో సూరారం ప్రాంతానికి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంజాయిని కొనుగోలు చేసేందుకే ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు..
విద్యార్థుల వద్ద కిలో గంజాయి దొరకడంతో దుండిగల్ పోలీసులు ఎన్‌డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు సంచరించినట్లు అనుమానిస్తున్న సూరారంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే గతంలో ఇదే తరహాలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన, విక్రయించే పాత నేరస్తుల చిట్టాను సైతం వెలికితీస్తున్నారు. దీనికి తోడు గంజాయి క్రయవిక్రయాలపై హాస్టల్‌లోని తోటి విద్యార్థులను సైతం విచారించే అవకాశం ఉంది. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి ఫోన్ సంఘటన స్థలంలోనే ధ్వంసంకాగా, మరో విద్యార్థి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. బైక్ నడిపిన సమయంలో విద్యార్థులు గంజాయి సేవించారా.. లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని వారు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment