ఆగస్టు 31లోగా గంజాయి రహితంగా మారుస్తాం
పోలీస్, టీజీఏఎన్‌బీతో కలిసి ఆపరేషన్లు చేస్తున్నాం
మూడు నెలల్లో నాటుసారా కనుమరుగు చేస్తాం
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గంజాయికి నగరంలో కేంద్రంగా మారుతున్న ధూల్‌పేట్ ప్రాంతాన్ని ఆగస్టు 31లోపు గంజాయి రహిత ప్రాంతంగా మార్చే లక్ష్యంతో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ధూల్‌పేట్ చేపట్టినట్టు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. నగరంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్‌పేట్‌లోనే మూలాలు ఉంటున్నందున ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపారు. ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి రవాణా, అమ్మకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న 15 మంది నిందితులను గుర్తించామని, ఇందులో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. శనివారం ఆబ్కారీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషితో కలిసి కమలాసన్‌రెడ్డి మాట్లాడారు.
ఎక్సైజ్ శాఖ పోలీసు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల సమన్వయంతో దాడులు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ధూల్‌పేట్‌తోపాటు గంజాయికి అడ్డాలుగా మారుతున్న నానక్‌రామ్‌గూడ, లంగర్‌హౌస్, సీతాఫల్‌మండి సహా ఇతర ప్రాంతాల్లోనూ నిఘా పెంచినట్టు తెలిపారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈఎస్ అంజిరెడ్డి బృందం శనివారం జరిపిన సోదాల్లో 54 కిలోల గంజాయి పట్టుబడిందని, గంజాయి రవాణా ముఠాలో కీలకంగా ఉన్న ఏ–1 రాహుల్‌సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్‌లో గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో క్రమంగా పెరుగుతున్న నాటుసారాపై సైతం దృష్టి పెట్టామని, మూడు నెలల్లో దీన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4,200 కిలోల బెల్లాన్ని , 50 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నట్టు కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఎక్సైజ్‌శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి మాట్లాడుతూ, ఆపరేషన్ ధూల్‌పేట్ ఈనెల 20 నుంచి ప్రారంభించామన్నారు. స్థానిక పోలీస్, ఎక్సైజ్‌శాఖ, టీజీఏఎన్‌బీ ఉమ్మడిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు.
ఈ నెలలో ఇప్పటివరకు ధూల్‌పేట్ ప్రాంతంలో 12 కేసులు నమోదు చేశామని, మొత్తం 37 మంది నిందితులను గుర్తించామన్నారు. ఈ ముఠాలు ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు నుంచి పెద్దమొత్తంలో తెచ్చిన ఎండు గంజాయిని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, బీబీనగర్ ప్రాంతాల్లో స్థావరాలు పెట్టుకుని, అక్కడ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోల్లో కొద్దికొద్ది మొత్తాల్లో నగరంలోకి తెస్తున్నట్టు గుర్తించామన్నారు. ధూల్‌పేట్‌తోపాటు ఇతర ప్రాంతాలపైనా గంజాయి ముఠాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment