Dhulpet
-
ఆపరేషన్ ధూల్‌పేట్
సాక్షి, హైదరాబాద్: గంజాయికి నగరంలో కేంద్రంగా మారుతున్న ధూల్‌పేట్ ప్రాంతాన్ని ఆగస్టు 31లోపు గంజాయి రహిత ప్రాంతంగా మార్చే లక్ష్యంతో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ధూల్‌పేట్ చేపట్టినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. నగరంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్‌పేట్‌లోనే మూలాలు ఉంటున్నందున ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపారు. ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి రవాణా, అమ్మకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న 15 మంది నిందితులను గుర్తించామని, ఇందులో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. శనివారం ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషితో కలిసి కమలాసన్‌రెడ్డి మాట్లాడారు. ఎక్సైజ్ శాఖ పోలీసు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల సమన్వయంతో దాడులు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ధూల్‌పేట్‌తోపాటు గంజాయికి అడ్డాలుగా మారుతున్న నానక్‌రామ్‌గూడ, లంగర్‌హౌస్, సీతాఫల్మండి సహా ఇతర ప్రాంతాల్లోనూ నిఘా పెంచినట్టు తెలిపారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈఎస్ అంజిరెడ్డి బృందం శనివారం జరిపిన సోదాల్లో 54 కిలోల గంజాయి పట్టుబడిందని, గంజాయి రవాణా ముఠాలో కీలకంగా ఉన్న ఏ–1 రాహుల్సింగ్పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్‌లో గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో క్రమంగా పెరుగుతున్న నాటుసారాపై సైతం దృష్టి పెట్టామని, మూడు నెలల్లో దీన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4,200 కిలోల బెల్లాన్ని , 50 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నట్టు కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఎక్సైజ్‌శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి మాట్లాడుతూ, ఆపరేషన్ ధూల్‌పేట్ ఈనెల 20 నుంచి ప్రారంభించామన్నారు. స్థానిక పోలీస్, ఎక్సైజ్‌శాఖ, టీజీఏఎన్‌బీ ఉమ్మడిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు ధూల్‌పేట్ ప్రాంతంలో 12 కేసులు నమోదు చేశామని, మొత్తం 37 మంది నిందితులను గుర్తించామన్నారు. ఈ ముఠాలు ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు నుంచి పెద్దమొత్తంలో తెచ్చిన ఎండు గంజాయిని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, బీబీనగర్ ప్రాంతాల్లో స్థావరాలు పెట్టుకుని, అక్కడ నుంచి ద్విచక్రవాహనాలు, ఆటోల్లో కొద్దికొద్ది మొత్తాల్లో నగరంలోకి తెస్తున్నట్టు గుర్తించామన్నారు. ధూల్‌పేట్‌తోపాటు ఇతర ప్రాంతాలపైనా గంజాయి ముఠాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం) తెరపడనుంది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని సొంతపార్టీ నేతలతోపాటు బయట వ్యక్తులు కోరుకుంటున్నారని ఆరోపించారు. తన చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు. ధూల్‌పేటలో పర్యటించి అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పారని రాజాసింగ్ ప్రస్తావించారు. అసెంబ్లీలో తాను లేకున్నా.. ధూల్‌పేటని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు. గుడుంబా నిషేధం తర్వాత ధూల్‌పేట ప్రజలు ఉపాధి కోల్పోయారని, తాను ఉన్నా లేకున్నా ధూల్‌పేట వాసులకు వచ్చే ప్రభుత్వ ఆశీర్వాదాలు ఉండాలని అన్నారు. తన తరుపున వారిని ఆదుకోవాలని కోరారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. కాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాజాసింగ్‌పై గతేడాది ఆగస్టు 23న బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు హైకమాండ్ తెలిపింది. శాసన సభాపక్ష పదవినుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు. చదవండి: సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్.. బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు -
గణపతి.. కేరాఫ్ ధూల్‌పేట్
విగ్రహాల తయారీ కేంద్రంగా గుర్తింపు ప్రతి ఇల్లూ ఓ పరిశ్రమే.. సిటీబ్యూరో: ధూల్‌పేట్.. ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది ఇరుకైన రోడ్లు.. గుడుంబా కంపు. ఇది నాణేనికి ఓవైపు. ఈ ప్రాంతంలోనే విగ్రహాల తయారీ పరిశ్రమగా కొనసాగుతుందని కొద్దిమందికే తెలుసు. సామూహికంగా నిర్వహించే వినాయక విగ్రహాలు, దసరాకు అమ్మవారి ప్రతిమలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు. ఇక్కడి కళాకారులు భక్తుల మనసు దోచేలా ప్రతిమలను మలచడంలో ప్రఖ్యాతిగాంచారు. కాన్సెప్ట్ చెబితే చాలు విగ్రహాలకు ప్రాణం పోస్తారు. ఇందుకు రాజస్థాన్, గుజరాత్ నుంచి మట్టిని తెచ్చి వాడతారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజల్లో ఐక్యత కోసం దేశవ్యాప్తంగా గణేశ ఉత్సవాలు జరపాలని బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు ఇక్కడివారిని కదిలించింది. అప్పటి నుంచి ధూల్‌పేట్‌లో గణేశ విగ్రహాల తయారీ మొదలైంది. ఇక్కడి ప్రతి ఇంటిలోనూ విగ్రహాలు తయారు చేయడం విశేషం. చేయి తిరిగిన కళాకారులు... ఈ ప్రాంతంలో ప్రతి ఇంటా చేయి తిరిగిన కళాకారులు ఉన్నారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా బొమ్మలకు ప్రాణం పోస్తారు. ఆర్డర్ ఇచ్చే భక్తుల అభీష్టానికి అనుగుణంగా విగ్రహాలను మలచడం ఇక్కడి కళాకారుల నైజం. చిన్న ప్రతిమ నుంచి 15 అడుగుల విగ్రహం వరకు సునాయసంగా తయారు చేయడంలో వీరి నైపుణ్యత కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేశ విగ్రహాన్ని తొలినాళ్లలో ఇక్కడివారే చేసేవారని చెబుతుంటారు. జనవరిలో గణేశ విగ్రహాల తయారీ ప్రారంభించి పండగ నాటికి రంగులు అద్ది ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత దసరా కోసం అమ్మవారి విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు. ఏడాదంతా వీరు ఇదే పనిలో ఉండడం గమనార్హం. రూ. 30 వేలు లోపు ఖరీదు చేసే విగ్రహాలను ముందుగానే సిద్ధం చేస్తారు. ఆపై విగ్రహాలను ఆర్డర్‌పై చేస్తారు.