గణపతి.. కేరాఫ్ ధూల్‌పేట్
విగ్రహాల తయారీ కేంద్రంగా గుర్తింపు
ప్రతి ఇల్లూ ఓ పరిశ్రమే..
సిటీబ్యూరో: ధూల్‌పేట్.. ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది ఇరుకైన రోడ్లు.. గుడుంబా కంపు. ఇది నాణేనికి ఓవైపు. ఈ ప్రాంతంలోనే విగ్రహాల తయారీ పరిశ్రమగా కొనసాగుతుందని కొద్దిమందికే తెలుసు. సామూహికంగా నిర్వహించే వినాయక విగ్రహాలు, దసరాకు అమ్మవారి ప్రతిమలు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు. ఇక్కడి కళాకారులు భక్తుల మనసు దోచేలా ప్రతిమలను మలచడంలో ప్రఖ్యాతిగాంచారు. కాన్సెప్ట్ చెబితే చాలు విగ్రహాలకు ప్రాణం పోస్తారు. ఇందుకు రాజస్థాన్, గుజరాత్ నుంచి మట్టిని తెచ్చి వాడతారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజల్లో ఐక్యత కోసం దేశవ్యాప్తంగా గణేశ ఉత్సవాలు జరపాలని బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపు ఇక్కడివారిని కదిలించింది. అప్పటి నుంచి ధూల్‌పేట్‌లో గణేశ విగ్రహాల తయారీ మొదలైంది. ఇక్కడి ప్రతి ఇంటిలోనూ విగ్రహాలు తయారు చేయడం విశేషం.
చేయి తిరిగిన కళాకారులు...
ఈ ప్రాంతంలో ప్రతి ఇంటా చేయి తిరిగిన కళాకారులు ఉన్నారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా బొమ్మలకు ప్రాణం పోస్తారు. ఆర్డర్ ఇచ్చే భక్తుల అభీష్టానికి అనుగుణంగా విగ్రహాలను మలచడం ఇక్కడి కళాకారుల నైజం. చిన్న ప్రతిమ నుంచి 15 అడుగుల విగ్రహం వరకు సునాయసంగా తయారు చేయడంలో వీరి నైపుణ్యత కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేశ విగ్రహాన్ని తొలినాళ్లలో ఇక్కడివారే చేసేవారని చెబుతుంటారు. జనవరిలో గణేశ విగ్రహాల తయారీ ప్రారంభించి పండగ నాటికి రంగులు అద్ది ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత దసరా కోసం అమ్మవారి విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు. ఏడాదంతా వీరు ఇదే పనిలో ఉండడం గమనార్హం. రూ. 30 వేలు లోపు ఖరీదు చేసే విగ్రహాలను ముందుగానే సిద్ధం చేస్తారు. ఆపై విగ్రహాలను ఆర్డర్‌పై చేస్తారు.