Two students killed
-
ఒడ్డుకు రాగానే ఫోన్ చేస్తానన్నావు కదమ్మా!
కృష్ణా (మచిలీపట్నంటౌన్): సరదాగా బీచ్‌లో గడుపుదామని వచ్చిన విద్యార్థినులను రాకాసి అలలు మింగేశాయి. మచిలీపట్నానికి చెందిన కళ్లేపల్లి పూజిత (22), ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన ప్రమీలారాణి జాస్మిన్(22), అదే మండలం గరగపర్రు గ్రామానికి చెందిన దత్తల ఆశాజ్యోతి భీమవరంలోని విష్ణు కాలేజీలో బీ–ఫార్మసీ చదువుతున్నారు. ఈ నెల 21వ తేదీతో ఫైనల్ ఇయర్ పరీక్షలు ముగియటంతో జాస్మిన్, ఆశాజ్యోతి కలసి స్నేహితురాలు పూజితతో మచిలీపట్నం వచ్చారు. పూజిత ఇంటి వద్ద ఆదివారం ఉల్లాసంగా గడిపారు. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో బీచ్‌కు చేరుకున్నారు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా రాకాసి అల దాడితో ముగ్గురూ నీళ్లలోకి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ఆశాజ్యోతిని రక్షించగలిగారు. పూజిత, జాస్మిన్లను మెరైన్ పోలీసులు గాలించి ఒడ్డుకు చేర్చినా, అప్పటికే వారిరువురు మృతి చెందారు. రూరల్ ఎస్ఐ జి.వాసు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను 108లో బందరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. ఒడ్డుకు రాగానే ఫోన్ చేస్తానన్నావు కదమ్మా! అమ్మా! నేను బీచ్‌లో స్నానానికి వెళుతున్నా.. ఒడ్డుకు రాగానే నేనే ఫోన్ చేస్తా... ఈలోపు నువ్వు చేయొద్దని చెప్పావు... సముద్రంలోకి వెళ్లి మాయ మైపోయావా అమ్మా..అంటూ జాస్మిన్ తల్లి కాకర్ల సుభాషిణి భోరున విలపించటం చూపరులను కలచివేసింది. జాస్మిన్ మృతి వార్త తెలిసిన ఆమె తల్లిదండ్రులు అగస్టీన్, సుభాషిణి, సోదరుడు రాజు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. జాస్మిన్ తండ్రి పిప్పర లోని పెంతెకోస్తు చర్చి పాస్టర్. తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెను తలుచుకుంటూ రోదించటం స్థానికులను కంట తడి పెట్టించింది. కానరాని లోకాలకు తరలిపోయావా తల్లీ! బీచ్‌లో తమ కుమార్తె పూజిత, ఆమె స్నేహితురాలు జాస్మిన్ మృతి చెందిన వార్త తెలుసుకున్న పూజిత తండ్రి కృష్ణవరప్రసాద్, తల్లి లక్ష్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుప్పకూలిపోయారు. పూజిత మృతదేహంపై పడి భోరున విలపించారు. బందరు మండలం గుండుపాలెంకు చెందిన కృష్ణవరప్రసాద్ పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమార్తెను చదివిస్తున్నారు. పెద్దకుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. స్వగ్రామం గుండుపాలెం నుంచి కొన్నేళ్ల క్రితం నగరంలోని పరాసుపేటకు వచ్చి నివసిస్తున్నారు. శనివారం చివరి పరీక్ష కావటంతో కృష్ణవరప్రసాద్ భీమవరం కారు వేసుకుని వెళ్లి కుమార్తె పూజితతో పాటు ఆమె స్నేహితురాళ్లు జాస్మిన్, ఆశాజ్యోతిలను బందరు తీసుకువచ్చారు. జూన్ 1న కోయంబత్తూరు ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లం పూజిత, నేను జూన్ 1న కోయంబత్తూరుకు ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లం. మేమిద్దరం క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాం. ఈలోగా ఇలా జరిగింది. కలిసి ఆనందంగా గడిపిన మా ముగ్గురిలో ఇద్దరు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. – ఆశాజ్యోతి, మృత్యుంజయురాలు -
అతివేగం ప్రాణాలు తీసింది!
దుండిగల్: వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం మూలమలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారి బైక్‌లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో అనంత్ విశాల్(23), సుజిత్(21) బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. సుజిత్ స్థానికంగా ఉన్న మహాలక్ష్మీ బాయ్స్ హాస్టల్లో, విశాల్ మరో హాస్టల్లో ఉంటున్నారు. వీరిద్దరూ శనివారం రాత్రి 11 గంటల సమయంలో యమహా బైక్‌పై సూరారం ప్రాంతానికి వచ్చారు. తిరిగి బహదూర్‌పల్లి వైపు వేగంగా వెళ్తుండగా సూరారం కట్టమైసమ్మ దేవాలయం సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విశాల్, సుజిత్ అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాల్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా కొడిగిరి మండలం దోమలెడిగి కాగా, తండ్రి విఠల్ పటేల్ ఎంపీటీసీ. సుజిత్ స్వస్థలం మంచిర్యాల. బైక్‌లో లభ్యమైన గంజాయి.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల వద్ద ఉన్న ఎరుపు రంగు బ్యాగ్‌లో గంజాయి లభించడం స్థానికంగా కలకలం రేపింది. మైసమ్మగూడలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు రాత్రి సమయంలో సూరారం ప్రాంతానికి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గంజాయిని కొనుగోలు చేసేందుకే ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు.. విద్యార్థుల వద్ద కిలో గంజాయి దొరకడంతో దుండిగల్ పోలీసులు ఎన్డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు సంచరించినట్లు అనుమానిస్తున్న సూరారంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే గతంలో ఇదే తరహాలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన, విక్రయించే పాత నేరస్తుల చిట్టాను సైతం వెలికితీస్తున్నారు. దీనికి తోడు గంజాయి క్రయవిక్రయాలపై హాస్టల్లోని తోటి విద్యార్థులను సైతం విచారించే అవకాశం ఉంది. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి ఫోన్ సంఘటన స్థలంలోనే ధ్వంసంకాగా, మరో విద్యార్థి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు. బైక్ నడిపిన సమయంలో విద్యార్థులు గంజాయి సేవించారా.. లేదా అన్నది పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని వారు పేర్కొంటున్నారు. -
వాగులో పడి ఇద్దరు విద్యార్ధుల మృతి
-
మృత్యు శకటం
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు పీజీ విద్యార్థినుల మృతి హైదరాబాద్: ఆర్టీసీ బస్సు మృత్యు శకటమై దూసుకొచ్చింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు పీజీ విద్యార్థినుల ప్రాణాలను నిలువునా బలితీసుకుంది. ముషీరాబాద్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి ఇరువురు యువకులు దుర్మరణం పాలై రెండు రోజులైనా గడవకముందే మరో విషాదం స్థానికులను కలచివేసింది. కవాడిగూడ ప్రాగాటూల్స్ సమీపంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. వివరాలివి... ఈసీఐఎల్ నాగారంలో నివసించే సుస్మితాశర్మ (23), సైనిక్‌పురీ జ్యోతినగర్ కాలనికి చెందిన హుస్నా రెజా(22) వెస్ట్‌మారేడుపల్లిలోని కస్తూర్బా కళాశాలలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. శనివారం దోమలగూడ ఏవీ కళాశాలలో ‘గ్లిట్జ్ 2కె 15’ ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ కోసం సుస్మిత స్కూటీపై ఇరువురూ బయలుదేరారు. ప్రాగాటూల్స్ వద్ద ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ నుంచి సెక్రటేరియట్‌కు వెళుతున్న చెంగిచర్ల డిపో ఆర్టీసీ బస్సు (రూట్ నం.15వై) వెనక నుంచి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో విద్యార్థినులు బస్సు కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన వారిని ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందారు. మరణంలోనూ స్నేహబంధాన్ని వీడని వీరిని చూసి కళాశాల సిబ్బంది, స్నేహితులు, విద్యార్థినుల తల్లిదండ్రులు విలపించారు. బస్సు డ్రైవర్ సత్తయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27న సుస్మిత పెళ్లి... ఇదిలావుంటే... మృతురాలు సుస్మితకు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 27న ముహూర్తం. శుక్రవారమే ఆమె తల్లిదండ్రులు ఫంక్షన్ హాల్‌కు అడ్వాన్స్ కూడా చెల్లించారు. ఇంతలోనే జరిగిన ఈ దారుణాన్ని తలచుకొని సుస్మిత తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యశర్మ, స్వర్ణలత దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాగా, పక్షవాతంతో మూడు నెలలపాటు సెలవులో ఉన్న బస్సు డ్రైవర్ సత్తయ్య గురువారమే తిరిగి విధుల్లో చేరాడు. రెండు రోజులకే ప్రమాదానికి కారణమయ్యాడు. అతడికి ఆర్టీసీ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు జరిపారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదానికి కొద్దిగా ముందు ఓ ఆటోను కూడా ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు తెలియని వైనం... హుస్నా రెజా తల్లిదండ్రులు సయ్యద్ అలీ రెజా, దీనత్ రెజాలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో బంధువులు వారికి కుమార్తె మరణవార్త విషయం చెప్పలేదు. దీంతో వారు ఇంకా కుమార్తె ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్నారు.