బస్సు, లారీ ఢీ.. 12 మందికి గాయాలు
మైదుకూరు టౌన్: మైదుకూరు సమీపంలోని జాతీయ రహదారిలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు– కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు మైదుకూరు శివారులోని జాతీయ రహదారిలోకి వెళ్తుండగా.. అదే సమయంలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ కంటైనర్‌లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రమీల, రాధమ్మ, జాని, రాఘవేంద్ర, రమాదేవి, లక్ష్మీదేవిలకు తీవ్ర గాయాలు కాగా ఎన్.ఓబులేసు, టి.ఓబులేసు, హరిప్రసాద్, రవి, రెడ్డయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా కడప, రాజంపేట ప్రాంతాలకు చెందిన వారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.