Container lorry
-
చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలు
దొడ్డబళ్లాపురం: శనివారంనాడు నెలమంగల వద్ద కంటెయినర్ లారీ పడి కారు నుజ్జయిన ప్రమాదంలో మరణించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుమందికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా జత్ తాలూకా మొరబగి గ్రామంలో అశృ నయనాలతో బంధువులు, గ్రామస్తులు వీడ్కోలు పలికారు. నెలమంగళ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగించి ఆదివారం ఉదయం ఆరు మృతదేహాలను అంబులెన్సుల్లో గ్రామానికి తీసుకువచ్చారు. అప్పటికే గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ పెద్ద చంద్రం యోగప్ప, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బంధువుల మృతదేహాలకు సహోదరుడు మల్లికార్జున్ నిప్పు అంటించారు. చంద్రం ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగులు తరలివచ్చారు. చంద్రంపై గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు ఉంది. నిరుద్యోగులు ఎవరున్నా వారికి ఉద్యోగం కల్పించేవాడు. చంద్రం పేద కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదిగారు.ఉసురు తీసిన కంటైనర్ లారీ -
ఉసురు తీసిన కంటైనర్ లారీ
ఎక్కడో మహారాష్ట్ర సరిహద్దుల్లో పుట్టి పెరిగి, బెంగళూరుకు వచ్చారు. ఓ ఐటీ కంపెనీ నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధినిస్తున్నారు. వీకెండ్, క్రిస్మస్ను సొంతూరిలో సంతోషంగా చేసుకుందామని కుటుంబంతో పయనమయ్యారు. కానీ అదే చివరి ప్రయాణమైంది. గంట దాటిందో లేదో.. మృత్యుఘంటికలు మోగాయి. కంటైనర్ లారీ యమ శకటంలా వచ్చి ఆ కారు మీద పడింది. అంతే.. కుటుంబ యజమానితో పాటు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బంధువుల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. రోడ్ టెర్రర్ విషాదానికి ఇది తాజా ఉదాహరణ.దొడ్డబళ్లాపురం: రాజధాని సమీపంలో తుమకూరు– బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కంటైనర్ లారీ.. కారు మీదకు పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 6మంది మృత్యువాత పడ్డారు. బెంగళూరులోని ఐఏఎస్‌టీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ యజమాని చంద్రం యోగప్ప (48), సతీమణి గౌరాబాయి(42), పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు. కొంత సేపటికే.. వివరాలు.. విజయపుర– మహారాష్ట్ర సరిహద్దులకు చెందిన చంద్రం యోగప్ప బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉంటూ ఓ చిన్నస్థాయి ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. వీకెండ్‌తో పాటు క్రిస్మస్ పండుగకని సొంత ఓల్వో కారులో ఊరికి బయల్దేరారు. గత అక్టోబరులో కొత్త ఓల్వో కారును కొన్నట్లు తెలిసింది. శనివారం ఉదయం సుమారు 9:30 గంటలకు ఇంటి నుంచి బయల్దేరినట్లు తెలిసింది. 60 కిలోమీటర్లు ప్రయాణించారో లేదో... ఈ దారుణ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో చంద్రం కారును నడుపుతున్నారు. కంటైనర్ అతివేగం.. ⇒ బెంగళూరు– తుమకూరు ఎన్‌హెచ్ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ⇒ బెంగళూరు వైపు నుంచి అనేక వాహనాలు తుమకూరు వైపు వెళ్తున్నాయి. వీకెండ్ కావడంతో హైవే రద్దీగా ఉంది. ⇒ కంటైనర్ లారీ, పక్క లేన్‌లో చంద్రం కుటుంబం ఓల్వో కారు వెళ్తోంది. కంటైనర్ ముందు వెళ్తున్న నందిని పాల వ్యాన్, కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి లేన్ దాటి వెళ్లింది, అలా చంద్రం ఓల్వో కారు మీద పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ⇒ ఈ రభసకు కారు పూర్తిగా తుక్కయింది. కారులోని వారికి ఏం జరిగిందో తెలిసేలోగా నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోయారు. ఈ కంటైనర్‌తో పాటు పాల వ్యాన్ బోల్తా పడగా, ఆ డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల చొరవ వెంటనే స్థానిక యువకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కంటైనర్ కింద నుంచి కారును బయటకు తీయడానికి శ్రమించారు. క్రేన్లను తెప్పించి కంటైనర్‌ను పక్కకు జరిపించారు. ఇంతలో స్థానిక పోలీసులు చేరుకున్నారు. అతి కష్టం మీద కారులోని మృతదేహాలను బయటకు తీశారు. ఉదయం 11 గంటలకు దుర్ఘటన జరిగితే మధ్యాహ్నం 1 గంట వరకు కారును బయటకు లాగే పని కొనసాగింది. ఈ ప్రమాదంలో హైవేలో అటు ఇటు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం నెలకొంది. వాట్సాప్ గ్రూప్‌లలో ఈ సమాచారం వేగంగా వ్యాపించింది. తమ యజమాని కుటుంబం దుర్మరణం పాలైందని తెలిసి హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న ఐఏఎస్‌టీ సాఫ్ట్వేర్ కంపెనీ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. 2018లో ప్రారంభమైన ఈ కంపెనీలో 100మందిపైగా పని చేస్తున్నారు. కొందరు వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. మరికొందరు లాగౌట్ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. విజయపుర వద్ద మొరబగి గ్రామంలో ఉండే యోగప్ప తల్లితండ్రులయిన ఈరగొండ, జక్కవ్వలకు ప్రమాదం విషయం ఇంకా చెప్పలేదని తెలిసింది.అలా జరిగిపోయింది కంటైనర్ డ్రైవర్దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఈ ఘోరం జరిగిందని కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ చెప్పాడు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ.. ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడంతో ఢీకొనకుండా తప్పించబోయి స్టీరింగ్ తిప్పడంతో వాహనం పక్కకి దూసుకుపోయిందన్నాడు. ఇంత ఘోరం జరిగినట్టు తనకు తెలీదని, విషయం తెలిసి చాలా భాధగా ఉందని ఆరిఫ్ అన్నారు. మరోవైపు ప్రమాదంపై నెలమంగల డీఎస్పీ జగదీష్ సమగ్ర విచారణ చేయనున్నారు. -
కంటైనర్‌లో వచ్చి.. పోలీసులనే ఏమార్చి..
సేలం: కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లో శుక్రవారం వేకువజామున ఒకే సమయంలో మూడు ఏటీఎంలలో చోరీలకు పాల్పడి తప్పించుకు వెళ్తున్న దొంగల ముఠా కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు వేట మొదలెట్టారు. ఏటీఎం చోరీల్లో ఆరితేరిన హైటెక్ హర్యానా దొంగలు లగ్జరీ కారు సహా కంటైనర్ లారీలో తప్పించుకెళ్తుండడాన్ని గుర్తించిన నామక్కల్ పోలీసులు సినీ తరహాలో ఛేజింగ్ చేశారు. వారిని పట్టుకునే క్రమంలో పెద్ద ఫైట్ తప్పలేదు. ఏటీఎం దొంగల దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు. దీంతో నామక్కల్ పోలీసులు తుపాకీకి పనిపెట్టారు. ఇందులో ఓ దొంగ హతమయ్యాడు. మరొకడు ఆస్పత్రి పాలు కాగా, మరో ఐదుగురు పోలీసులకు చిక్కారు. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లో వేకువ జామున ఒకే సమయంలో ఒకే ముఠా మూడు ఏటీఎంలలో చోరీకి పాల్పడింది. 2.30 నుంచి నాలుగు గంటల మధ్య ఈ చోరీలు జరిగాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎంలను బద్దలు కొట్టి అందులోని నగదును ఈ ముఠా తమ గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఓ ఏటీఎంలో మోగిన అలారంతో పోలీసులు అలర్ట్ అయ్యా రు. లగ్జరీ కారులో వచ్చి చోరీకి పాల్పడి తప్పించుకు వెళ్తున్న వారి కోసం వేట మొదలెట్టారు. అయితే, హఠాత్తుగా వీరు జాతీయ రహదారిలోకి వెళ్లగానే కనిపించకుండాపోయారు. కంటైనర్‌లో లగ్జరీ కారు తమ రాష్ట్ర సరిహద్దులలోని చెక్ పోస్టులను త్రిస్సూ ర్ పోలీసులు అలర్ట్ చేశారు. అయితే, ఆ లగ్జరీ కారు కనిపించలేదు. మూడు ఏటీఎంలో రూ.65 లక్షల మేరకు నగదును ఈ ముఠా అపహరించుకెళ్లడంతో కేసును త్రిస్సూర్ నగర పోలీసు కమిషనర్ ఇలంగో సవాలుగా తీసుకున్నారు. త్రిస్సూర్ మీదుగా తమిళనాడులోని కోయంబత్తూరుకు, ఇక్కడి నుంచి కర్ణాటక వైపు వెళ్లే మార్గాలను పరిగణించారు. దీంతో తనతో పాటు ఐపీఎస్ బ్యాచ్‌లో శిక్షణ పొంది తమిళనాడు సరిహద్దు జిల్లాలు, కర్ణాటక సరిహద్దు జిల్లాలో పనిచేస్తూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కోయంబత్తూరు, నామక్కల్, ఈరోడ్, సేలం, కృష్ణగిరి మార్గాలలో ఉదయాన్నే రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీవ్ర వేటలో నిమగ్నమైంది. జాతీయ రహదారిలోకి త్రిస్సూర్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ కారు జాడ కాన రాలేదు. అదే సమయంలో గతంలో జరిగిన కేసులను పరిగణించిన పోలీసులు కంటైనర్ లారీలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర రహదారి మీదుగా ప్రవేశం జాతీయ రహదారిలో వెళ్తే తమను పోలీసులు పసిగట్టేస్తారని, రాష్ట్ర రహదారుల్లోని చిన్నచిన్న రోడ్లను అస్త్రంగా చేసుకుని ఈ ముఠా నామక్కల్‌లోకి ప్రవేశించింది. çకుమారపాళయం సమీపంలోని వేప్పడై ప్రాంతంలో తనిఖీల్లో ఉన్న పోలీసులను చూసి ఓ కంటైనర్ లారీ ఆగకుండా వెళ్లింది. ముందుగా, పక్కగా వెళ్తున్న వాహనాలను ఢీకొట్టి ఆ కంటైనర్ దూసుకెళ్లడంతో అనుమానాలు నెలకొన్నా యి. తర్వాత సినీ కైమ్లాక్స్‌ను తలపించే విధంగా ఛేజింగ్ జరిగింది. నామక్కల్ ఎస్పీ రాజేష్ కన్నన్ నేతృత్వంలో పదుల సంఖ్యలో వాహనాలలో కంటైనర్ లారీని ఛేజ్ చేశారు. ఇందుకోసం నామక్కల్– సేలం రహదారిలోకి ఇతర వాహనాలు రాకుండా కాసేపు మూసివేశారు. సేలం జిల్లా సరిహద్దుల్లోకి ఆ కంటైనర్ లారీ ప్రవేశించే సమయంలో చుట్టుముట్టారు. కూలీలుగా వచ్చి లగ్జరీగా తిరుగుతూ పోలీసుల విచారణ మేరకు..కంటైనర్ లారీలో కొందరు, లగ్జరీ కారులో మరి కొందరు హర్యానా నుంచి త్రిస్సూర్‌కు చేరుకున్నారు. ఇక్కడ తమకు ఉన్న ఇన్ఫార్మర్ ద్వారా ఎస్బీఐ ఏటీఎంలను గురిపెట్టారు. పథకం ప్రకారం ఒకే రోజు ఏటీఎంలలో అపహరించిన సొమ్ముతో కారులో పరారు కావడం, హైవే లేదా, తాము గూగుల్ మ్యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న రూట్లలో తమతో వచ్చిన కంటైనర్‌ను సమీపించారు. తక్షణం ఆ కారును కంటైనర్‌లోకి ఎక్కించేసి ఏమీ ఏరగనట్టుగా ఏదో భారీ లోడ్ వెళ్తున్నట్టుగా డ్రైవర్ ముందుకు దూసుకెళ్లారు. అయితే, కుమార పాళయం వద్ద పోలీసుల హడావుడి చూసి ఆందోళనతో డ్రైవర్ అతివేగంగా దూసుకెళ్లడం, పలు వాహనాలు ధ్వంసం కావడంతో ఈ కంటైనర్‌పై దృష్టి పడింది. ఈ కంటైనర్ ఎస్కే లాజిస్టిక్స్ పేరిట ఉంది. హర్యానా నుంచి త్రిస్సూర్‌కు సరకుల లోడుతో వచ్చింది. అయితే, ఆ లారీ యజమాని సలీమ్ ఖాన్ పేర్కొంటూ తనకు 18 కంటైనర్లు ఉన్నాయని, వాటిని పలు సంస్థలకు అద్దెకు ఇచ్చినట్టు తెలిపారు. అయితే వారు ఎటువంటి పనులకు ఉపయోగిస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశాడు. మూడు రాష్ట్రాల పోలీసుల సకాలంలో సమాచారాన్ని బదిలీ చేసుకోవడంతో ఈ ఎటీఎం దొంగలు పట్టుబడ్డారు. వీరికి ఇతర కేసులతో సంబంధం ఉందా, అని విచారిస్తున్నారు. కేరళ త్రిస్సూర్ పోలీసులు సైతం నామక్కల్‌కు చేరుకుని విచారణ జరుపుతున్నారు. కేరళ త్రిస్సూర్‌లో చోరీకి పాల్పడి, నామక్కల్, సేలం జిల్లా సరిహద్దుల వరకు జరిగిన ఈ ఛేజింగ్, ఎన్కౌంటర్లో ఓ దొంగ హతం, ఇద్దరు పోలీసుల అధికారులు గాయపడడం వంటి సినీ తరహా ఈ క్లైమాక్స్ తమిళనాట పెద్ద చర్చకే దారి తీసింది.కాల్పుల్లో ఒకరు హతం తమ కంటైనర్‌ను పోలీసులు చుట్టుముట్టేయడంతో లోపల ఉన్న దొంగలు అలర్ట్ అయ్యారు. లారీని తనిఖీ చేస్తున్న కుమారపాళయం ఇన్స్పెక్టర్ తవమణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ రంజిత్‌లపై ఆ దుండగులు దాడికి దిగారు. గడ్డపార, బస్తాలను మోయడానికి ఉపయోగించే పొడవైన కొక్కి తరహా ఆయుధాలతో దాడి చేశారు. ఆ ఇద్దరికి గాయాలు కావడంతో ఇతర అధికారులు తుపాకీకి పనిపెట్టారు. పోలీసుల కాల్పులలో ఒక దొంగ సంఘటన స్థలంలోనే హతమయ్యాడు. మరొకడు గాయపడ్డాడు. దీంతో మిగిలిన ఐదుగురు దొంగ లు లొంగిపోయారు. ఈ సమాచారం సేలం డీఐజీ ఈ ఎస్ ఉమ నేతృత్వంలో ఎస్పీలు, డీఎస్పీలు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో విచారించారు. కంటైనర్ లారీలో లగ్జరీ కారు, పెద్ద ఎత్తున నగదు ఉండడంతో సీజ్ చేశారు. గాయపడ్డ పోలీసులను డీఐజీ పరామర్శించారు. పోలీసు కాల్పుల లో మరణించిన దొంగ హర్యానా రాష్ట్రం పుల్వామాకు చెందిన జమీనుద్దీన్‌గా గుర్తించారు. గాయపడ్డ దొంగ అజార్ అలీగా తేల్చారు. పట్టుబడ్డ ఐదుగురిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వీరంతా పుల్వామా నుంచి వచ్చి ఏటీఎంలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చినట్టు తేలింది. -
టోల్గేట్ బూత్‌లను ఢీకొన్న కంటైనర్
భిక్కనూరు: భిక్కనూరు సమీపంలోని టోల్ గేట్ వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో టోల్ బూత్ బాక్స్‌లు రెండు ధ్వంసమయ్యాయి. టోల్ గేట్ సిబ్బందికి ఒక్కరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్ అతి వేగంగా వచ్చి టోల్ గేట్ వద్ద ఉన్న డివైడర్‌తో పాటు రెండు బూత్ బాక్స్‌లను ఢీకొంది. దీంతో ఆరు, ఏడు బూత్ బాక్స్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారుపై టోల్‌బూత్ పడింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. అలాగే ఆరో బాక్స్‌లో విధులు నిర్వహిస్తున్న తిప్పాపూర్ గ్రామానికి చెందిన పోచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోచయ్యను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయినర్‌తో బోల్తా పడిన కంటైనర్‌ను పక్కకు తొలగించి ధ్వంసమైన బూత్ బాక్స్‌లను రోడ్డు పక్కకు తప్పించారు. -
కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం
సాక్షి, చెన్నై: రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురం వైపుగా రూ. 1000 కోట్ల నగదుతో వెళ్తున్న కంటైనర్ మార్గం మధ్యలో మరమ్మతులకు గురైంది. దీంతో ఆ వాహనానికి కట్టుదిట్టమైన భద్రతను కలి్పంచారు. వివరాలు.. చెన్నై రిజర్వు బ్యాంక్ నుంచి విల్లుపురం వైపుగా ఓ బ్యాంక్‌కు రూ. వెయ్యికోట్ల నగదును తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ నగదు తో రెండు కంటైనర్లు భారీ భద్రత నడుమ బుధవారం చెన్నై నుంచి బయలుదేరాయి. అయితే తాంబరం శానిటోరియం వద్ద ఓ వాహనం మరమ్మతుకు గురైంది. రోడ్డు మీద ఈ వాహనం హఠాత్తుగా ఆగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ముందుగా వెళ్తు న్న మరో కంటైనర్‌ను కూడా ఆపివేశారు. కంటైన ర్ మరమ్మతుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిద్ధ వైద్య కళాశాలలోకి ఆ వాహనాలను తీసుకెళ్లారు. తాంబరం పోలీసులు వాటికి భద్రత కల్పిస్తున్నారు. -
రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ
కడప అర్బన్: ఓ కంటైనర్ నుంచి రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చోరీచేసి దానిని వదిలేసి వెళ్లిపోయిన దుండగుల ఉదంతం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. కడప నగర శివార్లలోని దేవుని కడప ఆర్చి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఓ కంటైనర్ (హెచ్ఆర్ 38వై 3224)ను పదిరోజుల క్రితం కొందరు వదిలేసి వెళ్లారు. నిజానికి.. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఈ కంటైనర్ ముంబై, హైదరాబాద్, దువ్వూరు, నెల్లూరు మీదుగా చెన్నై చేరుకోవాల్సి వుంది. ఈ కంటైనర్‌లో ఎంతో విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను భద్రపరిచి, కోడింగ్‌తో లాక్‌చేసి మరీ నిర్వాహకులు ఎంతో పకడ్బందీగా పంపించారు. కానీ, ఈ కంటైనర్‌లోని రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను నిందితులు హైదరాబాద్–దువ్వూరు మార్గమధ్యంలో అపహరించారు. కంటైనర్ సకాలంలో చేరకపోయేసరికి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హైదరాబాద్–దువ్వూరు మధ్యలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి కడప శివార్లలో కంటైనర్‌ను కనుగొన్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ చోరీలో కంటైనర్ డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ బి. వెంకటశివారెడ్డిని వివరణ కోరగా.. చోరీ జరిగిన విషయం వాస్తవమేనని, సోమవారం సాయంత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
ముంబై, గుజరాత్ తీరాల్లో రూ.852 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై/అహ్మదాబాద్: వేర్వేరు తీరప్రాంతాల్లో రూ.852 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. మహారాష్ట్రలోని నవీ ముంబై పొరుగున ఉండే నహావా షెవా నౌకాశ్రయంలో ఆపిల్ పండ్ల కంటైనర్‌లో యాభై కేజీల అత్యంత నాణ్యమైన కొకైన్ మాదకద్రవ్యాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇటుకల్లా ఒక్కోటి కేజీ బరువుండేలా ప్యాక్చేసిన డ్రగ్స్‌ను గ్రీన్ ఆపిల్స్ మధ్యలో అధికారులు కనుగొన్నారు. సముద్రమార్గ కంటైనర్లలో ఇంతటి భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి స్మగ్లర్లు భారత్‌కు తరలించారు. మొత్తంగా 50.23 కేజీల బరువున్న ఈ డ్రగ్స్ అంతర్జాతీయ విపణిలో ఏకంగా రూ.502 కోట్ల ధర పలుకుతాయని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. వశీలో ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బత్తాయి పండ్ల మాటున 198 కేజీల మెథ్, 9 కేజీల కొకైన్‌ను కంటైనర్‌లో తెప్పించిన దిగుమతిదారు వీటినీ తెప్పించాడు. గత వారం నమోదైన కేసులో ఇప్పటికే ఇతడిని పోలీసులు అరెస్ట్చేయడం తెల్సిందే. గుజరాత్లో మరో 50 కేజీలు పాకిస్తాన్ నుంచి వస్తూ గుజరాత్ తీరానికి దూరంగా సముద్రజలాల్లో అడ్డగించిన ఒక పడవలో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం, ఉగ్ర వ్యతిరేక దళాలు స్వాధీనంచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వేళ ఈ ఆపరేషన్ నిర్వహించారు. అల్ సకర్ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్తానీయులను అరెస్ట్‌చేసి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరభారతం, పంజాబ్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే పాకిస్తాన్ డ్రగ్ మాఫియా ఈ సరకును పంపించాడని తెలుస్తోంది. -
నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!
సాగర్ (మధ్యప్రదేశ్): కోట్లు విలువచేసే స్మార్ట్ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్‌ను నలుగురు దొంగలు లూటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా మహరాజ్‌పూర్ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. అయితే ఆ ఫోన్లన్నింటినీ 24 గంటల్లోపే పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మాత్రం పారిపోయారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన ఈ మొబైల్ ఫోన్లను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా హరియాణాలోని గురుగ్రామ్‌కు తీసుకెళ్తున్నారు. ట్రక్కును గురువారం రాత్రి నలుగురు దుండగులు అడ్డుకుని డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. నరసింగాపూర్ వద్ద అతన్ని దింపేసి ఫోన్లను కంటైనర్ నుంచి తమ ట్రక్కులోకి మార్చుకుని పారిపోయారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలికి 400 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డగించడంతో ట్రక్కును వదిలేసి పారిపోయారు. మొత్తం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్ చెప్పారు. -
భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా కంటైనర్..
సాక్షి, బెంగళూరు(బొమ్మనహళ్లి): కాలేజీ విద్యార్థులు భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కంటైనర్ లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు మరణించిన సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. మృతులు బెంగళూరు సారక్కిలో నివాసం ఉంటున్న కౌశిక్ (21), సుష్మా (20). వీరు ఎ.ఎం.సీ కళాశాల్లో బీఎంహెచ్ కోర్సు చదువుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేద్దామని ఇద్దరూ బైక్‌పై బయల్దేరారు. బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న కెంపనాయకనహళ్ళి అక్వేరియల్ గార్మెంట్స్ ముందు బైక్‌ను వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో కౌశిక్, సుష్మా తీవ్రగాయాలతో మృతి చెందారు. కంటైనర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
నల్లగొండ: సడెన్‌గా యూ టర్న్ తీసుకున్న కంటైనర్.. కార్లు, బస్సు ఢీ
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద కాపర్తి సమీపంలో రోడ్డు మీద వస్తోన్న ఓ కంటైనర్ సడెన్‌గా యూటర్న్ తీసుకుంది. ఈ సమయంలో కంటైనర్ వెనకాలే వస్తున్న కార్లు దీన్ని గమనించి స్లో అయ్యాయి. ఇదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆర్టీసీ బస్సు.. కంటైనర్‌ని ఢీ కొట్టింది. (చదవండి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి) ఈ క్రమంలో కంటైనర్ వెనకే ఉన్న కార్లు దాని కిందకు చొచ్చుకుని వెళ్లాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో పోలీస్ సిబ్బంది క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కాసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి: కళ్లెదుటే ఆరిన కంటి దీపాలు -
మేక అడ్డురావడంతో.. బస్టాండ్‌లోకి దూసుకెళ్లిన కంటైనర్
సాక్షి, గుడిహత్నూర్: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొనబోయిన కంటైనర్ బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో బస్టాండ్‌లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్ వైపు నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకొని గుడిహత్నూర్ బస్టాండ్ చేరింది. మేక అడ్డురావడంతోనే.. బస్సు బస్టాండ్‌లోకి వస్తుండగా మేక అడ్డు రావడంతో డ్రైవర్ కొంచెం ముందుకు తీసుకెళ్లి నిలుపడంతో ప్రయాణికులు దిగుతున్నారు. అంతలోనే వెనుక నుంచి ఒక భారీ కంటైనర్ వేగంగా వస్తోంది. వేగం అదుపు కాకపోవడంతో డ్రైవర్ దానిని బస్టాండ్‌లోకి తీసుకెళ్లాడు. లేకుంటే వేగం తీవ్రతకు బస్సును ఢీకొనేదే. తేరుకున్న డ్రైవర్ కంటైనర్‌ను బస్టాండ్ ప్లాట్‌ఫాంపై నిలిపి దాక్కున్నాడు. స్థానికులు ఆర్టీసీ డ్రైవర్‌దే తప్పని ఆయనతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకొని కారకులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తప్పెవరిది? డోంగర్గావ్ యూటర్న్ నుంచి బస్సు బస్టాండ్ వచ్చే క్రమంలో స్పీడ్ లిమిట్ 40 కి.మీగా ఉంది. కాని ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి ఓ భారీ కంటైనర్ నేరుగా బస్టాండ్‌లోనికి దూసుకెళ్లడంతో దాని స్పీడ్ కనీసం 90 కి.మీ వేగం ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: బంజారాల బతుకమ్మ... తీజ్ పండుగ -
అమ్మ దగ్గరకెళ్దాం.. లేవండిరా!
కొడుకుల చేతుల మీదుగా తనువు చాలించాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అటువంటిది కడుపున పుట్టిన బిడ్డలు తమ కళ్లముందే మృత్యువు పాలైతే వారి కడుపు కోతకు అంతే ఉండదు. అప్పటి వరకూ తండ్రితో పాటే బైక్‌పై ప్రయాణించిన ఆ కొడుకులిద్దరూ.. మృత్యుశకటంలా దూసుకువచ్చిన కంటైనర్ ఢీకొని, మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. తుని పట్టణంలో ఆదివారం ఉదయం ఈ ఘోరం చోటు చేసుకుంది. కళ్లెదుటే నెత్తుటి ముద్దలుగా మారిన బిడ్డలను చూసి.. ఆ తండ్రి గుండె పగిలింది. తీవ్రమైన వేదనతో తల్లడిల్లిపోతూ, నడిరోడ్డుపై పొర్లాడుతూ ‘అమ్మ దగ్గరకెళ్దాం లేవండిరా’ అంటూ అతడు విలపించడం చూసిన వారిని కంటతడి పెట్టించింది. సాక్షి, తుని(తూర్పు గోదావరి) : లేవండిరా.. ఒరేయ్! అమ్మ దగ్గరకు వెళ్దాం.. సోదరి మిమ్మల్ని చూడాలంటోంది.. చేపల కూర వండించుకుని తిందాం.. సరదాగా గడుపుదాం.. అంటూ కుమారుల మృతదేహాల వద్ద ఆ తండ్రి రోదించిన తీరు హృదయాన్ని కలచివేసింది. కొద్ది నిమిషాల్లో తల్లి దగ్గరకు చేరుకునే లోపే ఆ కుమారులను ఓ కంటైనర్ మృత్యు ఒడిలోకి చేర్చింది.. కన్న తండ్రి కళ్లెదుటే జరిగిన ఈ ఘటన ప్రత్యక్షంగా చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఆదివారం ఉదయం తుని పట్టణం ఎస్.అన్నవరం రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులు, సోదరితో దుర్గ, తాతాజీ (ఫైల్) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన బర్రే వేణుయ్య తన ఇద్దరు కుమారులను తీసుకుని తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీలోని కవలపాడుకు మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. తుని మార్కెట్లో చేపలు కొనుగోలు చేశారు. మోటార్ సైకిల్ వెనుక బియ్యం బస్తాను కట్టుకుని వస్తున్న సమయంలో తుని వైపు వస్తున్న కంటైనర్ ఢీకొంది. వెనుక కూర్చున్న ఇద్దరు కుమారులు దుర్గ (17), తాతాజీ (7) కంటైనర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వేణుయ్య మాత్రం ఎడమ వైపు పడడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లి లోవలక్ష్మి, సోదరి సంతోషి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై ఇద్దరి మృతదేహాలను చూసి వారి దుఃఖానికి అవధులు లేకుండా పోయింది. అక్కడ వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ పిల్లలే ఆస్తిగా.. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలే ఆస్తి. వారిని చూసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.. తాము కష్టపడినా పిల్లలు మాత్రం చదువుకోవాలని భావించారు. దానికి అనుగుణంగానే ముగ్గురినీ చదివిస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం జిల్లా దాటి ఇటుకల బట్టీలో కూలీలుగా పని చేస్తున్నారు. పిల్లలు మాత్రం విశాఖ జిల్లా కోటవురట్ల గొల్లపేటలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. సొంతూరులో పని లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కవలపాడు గ్రామంలో ఇటుకల బట్టీలో బర్రే వేణుయ్య, అతని భార్య లోవలక్ష్మి పని చేస్తున్నారు. వీరు సంపాదించే సొమ్ముతో కుటుంబం సంతోషంగా ఉంటోంది. ఇటుకల బట్టీకి శనివారం సెలవు కావడంతో వేణుయ్య కోటవురట్ల వెళ్లారు. అప్పటికి రెండు రోజుల ముందే కుమార్తె సంతోషి కవలపాడులో తల్లి దగ్గరకు వచ్చింది. కోటవురట్లలో ఉన్న కుమారులు దుర్గ, తాతాజీలను తీసుకుని ఆదివారం బైక్‌పై వేణుయ్య పయనమయ్యారు. కేవలం 15 నిమిషాల్లో వీరు కవలపాడుకు చేరుకుంటారనగా, అంతలోనే కంటైనర్ రూపంలో ఇద్దరు కుమారులను మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. విగతజీవులుగా మారిన కుమారులను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తుని పట్టణ సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్‌కుమార్ శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రమాదం ఒకరిది.. ప్రాణాలు ఇతరులవి..
నూజివీడు: రెక్కాడితేగానీ డొక్కాడని ఇద్దరు నిరుపేద వ్యక్తులను కంటైనర్ లారీ రూపంలో పొంచి ఉన్న మృత్యువు కబళించివేసింది. కుటుంబాన్ని పోషించే వారు విగతజీవులవ్వడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘటన నూజివీడు మండలం పోలసానపల్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి నుంచి ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు వైపు వెళ్తున్న కంటైనర్‌కు పోలసానపల్లి సమీపంలోకి వచ్చే సరికి 11కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకి..ప్రాణాలు దక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో నూజివీడు మండలంలోని మీర్జాపురంలో చిన్న ఫ్యాన్సీ షాపు నడుపుకునే పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడుకు చెందిన పెనుమాక జోజిబాబు(36), మీర్జాపురం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్(65) ద్విచక్రవాహనంపై కోడిగుడ్ల కోసం వట్టిగుడిపాడు వైపు వెళ్తున్నారు. పోలసానపల్లి వద్దకు వచ్చే సరికి రోడ్డుపై అడ్డంగా కంటైనర్ ఉండడంతో.. ఇదేమిటని వారు కొద్దిగా ముందుకెళ్లి ఆ కంటైనర్‌ను ముట్టుకోగా.. తీవ్ర విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. అంతలోనే ద్విచక్రవాహనం పెట్రోలు ట్యాంక్ వద్ద నుంచి మంటలు చెలరేగి వారిద్దరూ ఘటనాస్థలంలోనే సజీవ దహనమయ్యారు. జోజిబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. తహసీల్దార్ మెండు సురేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును తెలుసుకున్నారు. రూరల్ ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పరామర్శించారు. -
ట్రక్కులో 39 మృతదేహాలు
లండన్: లండన్ దగ్గర్లో బుధవారం 39 మృతదేహాలున్న ఒక ట్రక్కు కనిపించి సంచలనానికి కారణమైంది. ఆ మృతదేహాలెవరివి, మరణాలకు కారణాలేంటి అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. గ్రేస్ ఏరియా ఆఫ్ ఎసెక్స్ దగ్గర్లో ఉన్న వాటర్‌గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో మృతదేహాలున్న ఒక ట్రక్కు ఉందని బుధవారం తమకు సమాచారం వచ్చిందని ఎసెక్స్ పోలీసులు తెలిపారు. ఆ ట్రక్కు బల్గేరియా నుంచి వచ్చినట్లు తెలిసిందని, వేల్స్‌లోని హోలీహెడ్ రేవు ద్వారా శనివారం యూకేలోకి వచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు. నార్త్ ఐర్లండ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి వివరాలు రాబడ్తున్నామని ఎసెక్స్ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్య్రూ మారినర్ చెప్పారు. బల్గేరియా నుంచి అక్రమంగా బ్రిటన్‌లోకి వచ్చే క్రమంలో వారు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలున్న ట్రక్ వెనుకభాగంలో మైనస్ 25 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అందులో దాక్కుని హోలీహెడ్ రేవు ద్వారా అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఇలాగే ఒక లారీ వెనుకభాగంలో దాక్కుని అక్రమంగా బ్రిటన్‌లోకి వస్తూ 58 మంది చైనీయులు చనిపోయారు. -
రూ. 2 వేల కోట్ల డబ్బు రోడ్డుపైనే..
టీ.నగర్ (చెన్నై): రూ.2 వేల కోట్ల నగదుతో బయలుదేరిన కంటైనర్ లారీ ఒకటి రిపేర్ కారణంగా చెన్నైలో నడిరోడ్డుపై నిలిచిపోయింది. విషయం తెల్సుకున్న స్థానికులు ఆ లారీని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటన గురువారం చెన్నైలో జరిగింది. మైసూరులోని రిజర్వు బ్యాంకు ముద్రాణాలయం నుంచి రూ.2 వేల కోట్ల నగదుతో నింపిన కంటైనర్ లారీ రిజర్వ్‌బ్యాంకు చెన్నై కార్యాలయానికి గురువారం బయల్దేరింది. రాత్రి 7.30 సమయంలో అమింజికరై, పుల్లా ఎవెన్యూ సిగ్నల్ గుండా వెళ్తున్నపుడు గేర్ బాక్సులో సమస్య తలెత్తి రోడ్డుపై ఆగింది. వెంటనే లారీకి భద్రతగా వస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) సిబ్బంది అక్కడికొచ్చారు. వేలకోట్ల నగదు ఉన్న లారీ ఆగిందనే విషయం తెల్సుకున్న స్థానికులు అక్కడ గుమిగూడారు. ఇంతలో రిజర్వ్‌బ్యాంకు అధికారులు, స్థానిక పోలీసులూ వచ్చారు. చివరకు మెకానిక్ వచ్చి సమస్యను సరిచేశాడు. దీంతో లారీ దాదాపు నాలుగు గంటలు అక్కడే నిలిచిపోయింది. ఎట్టకేలకు రాత్రి 11.30 గంటల సమయంలో చెన్నై రిజర్వు బ్యాంకుకు బయల్దేరింది. -
అదుపు తప్పి డివైడర్‌పైకి వెళ్లిన కంటైనర్
జాతీయ రహదారిపై డేంజర్ జోన్ల వద్ద ఏర్పాటు చేస్తున్న వేగ నిరోధకాలు కొన్ని సార్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పోలీసుల ఉద్దేశం మంచిదే అయినా భారీ కంటైనర్లతో వచ్చే లారీలకు వేగ నిరోధకాలు అడ్డుగోడలుగా మారి ప్రమాదానికి హేతువుగా మారుతున్నాయి. కోమర్తి వద్ద శనివారం ఇదే తరహాలో వేగనిరోధకాల వద్ద ఓ కంటైనర్ అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నరసన్నపేట: మండలంలోని కోమర్తి కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం ఓ కంటైనర్ అదుపు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విశాఖ నుంచి బరంపురం వైపు వెళ్తున్న కంటైనర్ వేగనిరోధకాలను క్రాస్ చేస్తుండగా అదుపు తప్పి డివైడర్‌పైకి ఎక్కింది. అదే సమయంలో ఎదురుగా కోల్‌కతా నుంచి హైదరాబాద్ వైపునకు వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే లారీ బోల్తా పడి బస్ కోసం రో డ్డు పక్కన నిల్చున్న వారివైపు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన రాజాంకు చెందిన బత్తుల వీర్రాజు పాటు మరో ముగ్గురు పరుగులు తీయగా ఉర్లాంకు చెందిన నడిమింటి గోవిందరావు దొరికిపోయాడు. ఈయనపై లారీలో ఉన్న పశువుల దాణా బస్తాలు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రున్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ సి.యాదవ్‌కు గాయాలయ్యాయి. రోడ్డుపై లారీ, కంటైనర్లు అడ్డంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నరసన్నపేట సీఐ పైడిపినాయుడు, ఎస్ఐ నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లింట విషాదం
♦ దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ♦ కంటైనర్ లారీని ఢీకొన్న పెళ్లి కారు ♦ గుంటూరు జిల్లా గూడపాడువాసి మృతి పశ్చిమ గోదావరి జిల్లా : గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి కరుటూరి ఫంక్షన్ హాల్స్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి మృతిచెందగా వధూవరులతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా గూడపాడు గ్రామానికి చెందిన పెళ్లి బృందం వివాహం అనంతరం అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో దేవరపల్లి వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తా పడి పొగాకు బేళ్ల ట్రాక్టర్‌పై వాలింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా కారు నడుపుతున్న పెళ్లి కుమారుడు చిన్నాన్న జి.నారాయణ (46) తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నారాయణ మృతిచెందాడు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. కారు వేగానికి బెలూన్స్ పగిలిపోయాయి. ఎస్సై పి.వాసు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు, లారీ ఢీ.. 12 మందికి గాయాలు
మైదుకూరు టౌన్: మైదుకూరు సమీపంలోని జాతీయ రహదారిలో శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు– కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు మైదుకూరు శివారులోని జాతీయ రహదారిలోకి వెళ్తుండగా.. అదే సమయంలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ కంటైనర్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రమీల, రాధమ్మ, జాని, రాఘవేంద్ర, రమాదేవి, లక్ష్మీదేవిలకు తీవ్ర గాయాలు కాగా ఎన్.ఓబులేసు, టి.ఓబులేసు, హరిప్రసాద్, రవి, రెడ్డయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా కడప, రాజంపేట ప్రాంతాలకు చెందిన వారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కంటెయినర్‌ను ఢీకొని బస్సు దగ్ధం
- ప్రయాణికులకు తప్పిన ముప్పు - ప్రకాశం జిల్లాలో ఘటన గుడ్లూరు : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఇంజన్లో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని మోచర్ల-వీరేపల్లి మధ్య జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంగళవారం రాత్రి 11 గంటలకు 20 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలుదేరింది. ఒంగోలులో ఇద్దరు దిగగా బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బస్సు వీరేపల్లి దాటగానే నెల్లూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగారుు. ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణ భయంతో అద్దాలు పగులగొట్టుకొని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వారు బయటకు రాగానే క్షణాల్లో మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో నుంచి దూకే సమయంలో ప్రయాణికులు రాము, వీరేశం, బస్సు డ్రైవర్ మోయిష్‌తోపాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. బస్సు ఢీకొట్టడంతో లారీ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తా కొట్టి తిరగబడింది. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సు అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని కందుకూరు డీఎస్పీ ప్రకాశ్‌రావు చెప్పారు. -
భారీ కంటెయినర్ బోల్తా : ఇద్దరు మృతి
భీమడోలు (పశ్చిమగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న భారీ కంటెయినర్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జాతీయరహదారిపై పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రంలోని రైల్వేగేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో.. లారీ దూసుకెళ్లి రోడ్డుపై ఉన్న వికలాంగుడిని ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ రోడ్డుపై ఉన్న చిన్న దేవాలయాన్ని ఢీకొట్టి సమీపాన ఉన్న బస్టాండ్ షెల్టర్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో లారీలో ఇద్దరు వ్యక్తులు ఉండగా, ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి లారీలో చిక్కుకొని ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఓవర్ టేక్ చేస్తూ..
కంటైనర్ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు అక్కడికక్కడే ఒకరి మృతి, మరో 12 మందికి గాయాలు సూర్యాపేట శివారులో ఘటన సూర్యాపేట రూరల్ అతివేగంతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట పట్టణ సమీపంలో సువెన్ కెమికల్ కంపెనీ ఎదుట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున కంటైనర్ లారీ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సూర్యాపేట పట్టణ సమీపంలోని సువెన్ కెమికల్ కంపెనీ సమీపంలోకి రాగానే కంటైనర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ఎడమ పక్కన పూర్తిగా దెబ్బతిని ఇంజన్ లారీ వెనుక భాగంలో ఇరుక్కు పోయింది. ఈ ప్రమాదంలో వైజాక్‌కు చెందిన అవినాష్ (19) అక్కడికక్కడే మృతిచెందగా, రాజమండ్రికి చెందిన గుత్తుల సాయినాథ్, విశాఖపట్టణానికి చెందిన సందీప్, శ్రీకాంత్, అమీత్, సంతోష్, శాలిని, కాకినాడకు చెందిన బస్సు క్లీనర్ పరుశరాంతో పాటు పూర్తి సమాచారం తెలియని వి.గుప్తా, రవితేజ, మాణిక్యమ్మ, ఎస్.సయ్యద్, రామక్రిష్ణకు గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకుని ఎస్ఐ పవన్‌కుమార్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. 108 వాహనంలో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కంటైనర్ లారీ డ్రైవర్ చాపరాల తాత య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేటరూరల్ ఎస్ఐ తెలిపారు. ఎంసెట్ పరీక్షకు వెళ్తూ.. వైజాక్‌కు చెందిన అవినాష్ ఈ నెల 14న జరిగే ఎంసెట్ పరీక్ష కోసం తన పెద్దనాన్న ఇంటికి హైదరాబాద్‌కు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఉన్నత చదువుల కోసం పెద్దనాన్న పిలుపు మేరకు పరీక్షకు ముందే పెద్దనాన్న ఇంటికి వెళ్తున్న అవినాష్ ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అవినాష్ మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కారు- ఆటో ఢీకొని.. నార్కట్‌పల్లి కారు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నార్కట్‌పల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం, పెరుమల్ల గ్రామానికి చెందిన ఎడ్ల అనిల్, సోదరుడు ఆంజనేయలు నల్లగొండలో ఆటోనడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం అనిల్ (18) ఆటోలో సామగ్రిని తీసుకుని నార్కట్‌పల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా బైపాస్ వద్దకు రాగనే హైదారాబాద్ నుంచి నల్లగొండకు వెళుతున్న కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆటో పక్కనే ఉన్న డీవైడర్‌ను మరోమారు ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమితం స్థానిక కామినేని అస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మోతీరామ్ తెలిపారు.