
కడప అర్బన్: ఓ కంటైనర్ నుంచి రూ.కోటి విలువైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చోరీచేసి దానిని వదిలేసి వెళ్లిపోయిన దుండగుల ఉదంతం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. కడప నగర శివార్లలోని దేవుని కడప ఆర్చి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఓ కంటైనర్ (హెచ్‌ఆర్ 38వై 3224)ను పదిరోజుల క్రితం కొందరు వదిలేసి వెళ్లారు.
నిజానికి.. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఈ కంటైనర్ ముంబై, హైదరాబాద్, దువ్వూరు, నెల్లూరు మీదుగా చెన్నై చేరుకోవాల్సి వుంది. ఈ కంటైనర్‌లో ఎంతో విలువైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను భద్రపరిచి, కోడింగ్‌తో లాక్‌చేసి మరీ నిర్వాహకులు ఎంతో పకడ్బందీగా పంపించారు. కానీ, ఈ కంటైనర్‌లోని రూ.కోటి విలువైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను నిందితులు హైదరాబాద్–దువ్వూరు మార్గమధ్యంలో అపహరించారు.
కంటైనర్ సకాలంలో చేరకపోయేసరికి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హైదరాబాద్–దువ్వూరు మధ్యలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి కడప శివార్లలో కంటైనర్‌ను కనుగొన్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ చోరీలో కంటైనర్ డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ బి. వెంకటశివారెడ్డిని వివరణ కోరగా.. చోరీ జరిగిన విషయం వాస్తవమేనని, సోమవారం సాయంత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment