laptops robbery
-
రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ
కడప అర్బన్: ఓ కంటైనర్ నుంచి రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చోరీచేసి దానిని వదిలేసి వెళ్లిపోయిన దుండగుల ఉదంతం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. కడప నగర శివార్లలోని దేవుని కడప ఆర్చి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఓ కంటైనర్ (హెచ్ఆర్ 38వై 3224)ను పదిరోజుల క్రితం కొందరు వదిలేసి వెళ్లారు. నిజానికి.. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఈ కంటైనర్ ముంబై, హైదరాబాద్, దువ్వూరు, నెల్లూరు మీదుగా చెన్నై చేరుకోవాల్సి వుంది. ఈ కంటైనర్‌లో ఎంతో విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను భద్రపరిచి, కోడింగ్‌తో లాక్‌చేసి మరీ నిర్వాహకులు ఎంతో పకడ్బందీగా పంపించారు. కానీ, ఈ కంటైనర్‌లోని రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను నిందితులు హైదరాబాద్–దువ్వూరు మార్గమధ్యంలో అపహరించారు. కంటైనర్ సకాలంలో చేరకపోయేసరికి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హైదరాబాద్–దువ్వూరు మధ్యలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి కడప శివార్లలో కంటైనర్‌ను కనుగొన్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ చోరీలో కంటైనర్ డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ బి. వెంకటశివారెడ్డిని వివరణ కోరగా.. చోరీ జరిగిన విషయం వాస్తవమేనని, సోమవారం సాయంత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
అమెజాన్ గోడౌన్లో భారీ చోరీ
కొత్తూరు(శంషాబాద్): ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది. రంగారెడ్డి జిల్లాలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ గోడౌన్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలో ఉన్న అమెజాన్ కంపెనీ గౌడౌన్లో 36 ల్యాప్ టాప్‌లు సహా మరొకొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయని నిర్వాహకులు గుర్తించారు. యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీటెక్ చేసినా.. అడ్డదారులు తొక్కాడు
పంజగుట్ట (హైదరాబాద్): అతడు బీటెక్ పూర్తి చేశాడు. కష్టపడితే మంచి ఉద్యోగం సంపాదించొచ్చు.. కానీ, త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశ అతడ్ని దొంగతనాల వైపు నడిపించింది. నగరంలోని హాస్టల్స్‌లో ల్యాప్‌ట్యాప్‌లు దొంగతనం చేస్తున్న ఓ యువకుడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 10 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సార్ నగర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.శంకర్ దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. అసోమ్ రాష్ట్రానికి చెందిన ఉదిప్తా దాస్ అలియాస్ బాబులా (25) కర్నాటకలో బీటెక్ పూర్తి చేసి ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఓ నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసుకుని హాస్టల్స్‌లో చేరడం... తోటివారు బయటకు వెళ్లగానే వారి ల్యాప్‌ట్యాప్‌లతో ఉడాయిస్తున్నాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 10 ల్యాప్‌ట్యాప్‌లు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఆదిత్యా ట్రేడ్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉదిప్తా దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చేసిన దొంగతనాల చిట్టా విప్పాడు. 10 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉదిప్తాదాస్ను రిమాండ్‌కు తరలించారు.