బీటెక్ చేసినా.. అడ్డదారులు తొక్కాడు
పంజగుట్ట (హైదరాబాద్): అతడు బీటెక్ పూర్తి చేశాడు. కష్టపడితే మంచి ఉద్యోగం సంపాదించొచ్చు.. కానీ, త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశ అతడ్ని దొంగతనాల వైపు నడిపించింది. నగరంలోని హాస్టల్స్‌లో ల్యాప్‌ట్యాప్‌లు దొంగతనం చేస్తున్న ఓ యువకుడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 10 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సార్ నగర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శంకర్ దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. అసోమ్ రాష్ట్రానికి చెందిన ఉదిప్తా దాస్ అలియాస్ బాబులా (25) కర్నాటకలో బీటెక్ పూర్తి చేసి ఉపాధి కోసం నగరానికి వచ్చాడు.
త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఓ నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసుకుని హాస్టల్స్‌లో చేరడం... తోటివారు బయటకు వెళ్లగానే వారి ల్యాప్‌ట్యాప్‌లతో ఉడాయిస్తున్నాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 10 ల్యాప్‌ట్యాప్‌లు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఆదిత్యా ట్రేడ్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉదిప్తా దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చేసిన దొంగతనాల చిట్టా విప్పాడు. 10 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉదిప్తాదాస్‌ను రిమాండ్‌కు తరలించారు.