సంఘటనా స్థలంలో రోదిస్తున్న మృతుల తల్లిదండ్రులు
కొడుకుల చేతుల మీదుగా తనువు చాలించాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అటువంటిది కడుపున పుట్టిన బిడ్డలు తమ కళ్లముందే మృత్యువు పాలైతే వారి కడుపు కోతకు అంతే ఉండదు. అప్పటి వరకూ తండ్రితో పాటే బైక్‌పై ప్రయాణించిన ఆ కొడుకులిద్దరూ.. మృత్యుశకటంలా దూసుకువచ్చిన కంటైనర్ ఢీకొని, మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. తుని పట్టణంలో ఆదివారం ఉదయం ఈ ఘోరం చోటు చేసుకుంది. కళ్లెదుటే నెత్తుటి ముద్దలుగా మారిన బిడ్డలను చూసి.. ఆ తండ్రి గుండె పగిలింది. తీవ్రమైన వేదనతో తల్లడిల్లిపోతూ, నడిరోడ్డుపై పొర్లాడుతూ ‘అమ్మ దగ్గరకెళ్దాం లేవండిరా’ అంటూ అతడు విలపించడం చూసిన వారిని కంటతడి పెట్టించింది.
సాక్షి, తుని(తూర్పు గోదావరి) : లేవండిరా.. ఒరేయ్! అమ్మ దగ్గరకు వెళ్దాం.. సోదరి మిమ్మల్ని చూడాలంటోంది.. చేపల కూర వండించుకుని తిందాం.. సరదాగా గడుపుదాం.. అంటూ కుమారుల మృతదేహాల వద్ద ఆ తండ్రి రోదించిన తీరు హృదయాన్ని కలచివేసింది. కొద్ది నిమిషాల్లో తల్లి దగ్గరకు చేరుకునే లోపే ఆ కుమారులను ఓ కంటైనర్ మృత్యు ఒడిలోకి చేర్చింది.. కన్న తండ్రి కళ్లెదుటే జరిగిన ఈ ఘటన ప్రత్యక్షంగా చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఆదివారం ఉదయం తుని పట్టణం ఎస్.అన్నవరం రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది.
తల్లిదండ్రులు, సోదరితో దుర్గ, తాతాజీ (ఫైల్)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన బర్రే వేణుయ్య తన ఇద్దరు కుమారులను తీసుకుని తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీలోని కవలపాడుకు మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. తుని మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేశారు. మోటార్ సైకిల్ వెనుక బియ్యం బస్తాను కట్టుకుని వస్తున్న సమయంలో తుని వైపు వస్తున్న కంటైనర్ ఢీకొంది. వెనుక కూర్చున్న ఇద్దరు కుమారులు దుర్గ (17), తాతాజీ (7) కంటైనర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వేణుయ్య మాత్రం ఎడమ వైపు పడడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లి లోవలక్ష్మి, సోదరి సంతోషి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై ఇద్దరి మృతదేహాలను చూసి వారి దుఃఖానికి అవధులు లేకుండా పోయింది. అక్కడ వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
ఆ పిల్లలే ఆస్తిగా..
ఆ దంపతులకు ముగ్గురు పిల్లలే ఆస్తి. వారిని చూసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.. తాము కష్టపడినా పిల్లలు మాత్రం చదువుకోవాలని భావించారు. దానికి అనుగుణంగానే ముగ్గురినీ చదివిస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం జిల్లా దాటి ఇటుకల బట్టీలో కూలీలుగా పని చేస్తున్నారు. పిల్లలు మాత్రం విశాఖ జిల్లా కోటవురట్ల గొల్లపేటలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. సొంతూరులో పని లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కవలపాడు గ్రామంలో ఇటుకల బట్టీలో బర్రే వేణుయ్య, అతని భార్య లోవలక్ష్మి పని చేస్తున్నారు. వీరు సంపాదించే సొమ్ముతో కుటుంబం సంతోషంగా ఉంటోంది. ఇటుకల బట్టీకి శనివారం సెలవు కావడంతో వేణుయ్య కోటవురట్ల వెళ్లారు. అప్పటికి రెండు రోజుల ముందే కుమార్తె సంతోషి కవలపాడులో తల్లి దగ్గరకు వచ్చింది.
కోటవురట్లలో ఉన్న కుమారులు దుర్గ, తాతాజీలను తీసుకుని ఆదివారం బైక్‌పై వేణుయ్య పయనమయ్యారు. కేవలం 15 నిమిషాల్లో వీరు కవలపాడుకు చేరుకుంటారనగా, అంతలోనే కంటైనర్ రూపంలో ఇద్దరు కుమారులను మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. విగతజీవులుగా మారిన కుమారులను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తుని పట్టణ సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్‌కుమార్ శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment