కంటైనర్‌లో చోరీ సొమ్ముతో కారు తరలింపు
సినీ తరహాలో పోలీసుల ఛేజింగ్
పోలీసులపై దొంగల దాడి
పోలీసుల కాల్పులు
ఒకరు హతం..మరొకరికి గాయాలు
పోలీసుల అదుపులో ఐదుగురు
సేలం: కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లో శుక్రవారం వేకువజామున ఒకే సమయంలో మూడు ఏటీఎంలలో చోరీలకు పాల్పడి తప్పించుకు వెళ్తున్న దొంగల ముఠా కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు వేట మొదలెట్టారు. ఏటీఎం చోరీల్లో ఆరితేరిన హైటెక్ హర్యానా దొంగలు లగ్జరీ కారు సహా కంటైనర్ లారీలో తప్పించుకెళ్తుండడాన్ని గుర్తించిన నామక్కల్ పోలీసులు సినీ తరహాలో ఛేజింగ్ చేశారు. వారిని పట్టుకునే క్రమంలో పెద్ద ఫైట్ తప్పలేదు. ఏటీఎం దొంగల దాడిలో ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు. దీంతో నామక్కల్ పోలీసులు తుపాకీకి పనిపెట్టారు. ఇందులో ఓ దొంగ హతమయ్యాడు.
మరొకడు ఆస్పత్రి పాలు కాగా, మరో ఐదుగురు పోలీసులకు చిక్కారు. కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లో వేకువ జామున ఒకే సమయంలో ఒకే ముఠా మూడు ఏటీఎంలలో చోరీకి పాల్పడింది. 2.30 నుంచి నాలుగు గంటల మధ్య ఈ చోరీలు జరిగాయి. గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎంలను బద్దలు కొట్టి అందులోని నగదును ఈ ముఠా తమ గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఓ ఏటీఎంలో మోగిన అలారంతో పోలీసులు అలర్ట్ అయ్యా రు. లగ్జరీ కారులో వచ్చి చోరీకి పాల్పడి తప్పించుకు వెళ్తున్న వారి కోసం వేట మొదలెట్టారు. అయితే, హఠాత్తుగా వీరు జాతీయ రహదారిలోకి వెళ్లగానే కనిపించకుండాపోయారు.
కంటైనర్‌లో లగ్జరీ కారు
తమ రాష్ట్ర సరిహద్దులలోని చెక్ పోస్టులను త్రిస్సూ ర్ పోలీసులు అలర్ట్ చేశారు. అయితే, ఆ లగ్జరీ కారు కనిపించలేదు. మూడు ఏటీఎంలో రూ.65 లక్షల మేరకు నగదును ఈ ముఠా అపహరించుకెళ్లడంతో కేసును త్రిస్సూర్ నగర పోలీసు కమిషనర్ ఇలంగో సవాలుగా తీసుకున్నారు. త్రిస్సూర్ మీదుగా తమిళనాడులోని కోయంబత్తూరుకు, ఇక్కడి నుంచి కర్ణాటక వైపు వెళ్లే మార్గాలను పరిగణించారు. దీంతో తనతో పాటు ఐపీఎస్ బ్యాచ్‌లో శిక్షణ పొంది తమిళనాడు సరిహద్దు జిల్లాలు, కర్ణాటక సరిహద్దు జిల్లాలో పనిచేస్తూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కోయంబత్తూరు, నామక్కల్, ఈరోడ్, సేలం, కృష్ణగిరి మార్గాలలో ఉదయాన్నే రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీవ్ర వేటలో నిమగ్నమైంది. జాతీయ రహదారిలోకి త్రిస్సూర్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ కారు జాడ కాన రాలేదు. అదే సమయంలో గతంలో జరిగిన కేసులను పరిగణించిన పోలీసులు కంటైనర్ లారీలపై దృష్టి పెట్టారు.
రాష్ట్ర రహదారి మీదుగా ప్రవేశం
జాతీయ రహదారిలో వెళ్తే తమను పోలీసులు పసిగట్టేస్తారని, రాష్ట్ర రహదారుల్లోని చిన్నచిన్న రోడ్లను అస్త్రంగా చేసుకుని ఈ ముఠా నామక్కల్‌లోకి ప్రవేశించింది. çకుమారపాళయం సమీపంలోని వేప్పడై ప్రాంతంలో తనిఖీల్లో ఉన్న పోలీసులను చూసి ఓ కంటైనర్ లారీ ఆగకుండా వెళ్లింది. ముందుగా, పక్కగా వెళ్తున్న వాహనాలను ఢీకొట్టి ఆ కంటైనర్ దూసుకెళ్లడంతో అనుమానాలు నెలకొన్నా యి. తర్వాత సినీ కైమ్లాక్స్‌ను తలపించే విధంగా ఛేజింగ్ జరిగింది. నామక్కల్ ఎస్పీ రాజేష్ కన్నన్ నేతృత్వంలో పదుల సంఖ్యలో వాహనాలలో కంటైనర్ లారీని ఛేజ్ చేశారు. ఇందుకోసం నామక్కల్– సేలం రహదారిలోకి ఇతర వాహనాలు రాకుండా కాసేపు మూసివేశారు. సేలం జిల్లా సరిహద్దుల్లోకి ఆ కంటైనర్ లారీ ప్రవేశించే సమయంలో చుట్టుముట్టారు.
కూలీలుగా వచ్చి లగ్జరీగా తిరుగుతూ
పోలీసుల విచారణ మేరకు..కంటైనర్ లారీలో కొందరు, లగ్జరీ కారులో మరి కొందరు హర్యానా నుంచి త్రిస్సూర్‌కు చేరుకున్నారు. ఇక్కడ తమకు ఉన్న ఇన్‌ఫార్మర్ ద్వారా ఎస్‌బీఐ ఏటీఎంలను గురిపెట్టారు. పథకం ప్రకారం ఒకే రోజు ఏటీఎంలలో అపహరించిన సొమ్ముతో కారులో పరారు కావడం, హైవే లేదా, తాము గూగుల్ మ్యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న రూట్లలో తమతో వచ్చిన కంటైనర్‌ను సమీపించారు. తక్షణం ఆ కారును కంటైనర్‌లోకి ఎక్కించేసి ఏమీ ఏరగనట్టుగా ఏదో భారీ లోడ్ వెళ్తున్నట్టుగా డ్రైవర్ ముందుకు దూసుకెళ్లారు. అయితే, కుమార పాళయం వద్ద పోలీసుల హడావుడి చూసి ఆందోళనతో డ్రైవర్ అతివేగంగా దూసుకెళ్లడం, పలు వాహనాలు ధ్వంసం కావడంతో ఈ కంటైనర్‌పై దృష్టి పడింది.
ఈ కంటైనర్ ఎస్‌కే లాజిస్టిక్స్ పేరిట ఉంది. హర్యానా నుంచి త్రిస్సూర్‌కు సరకుల లోడుతో వచ్చింది. అయితే, ఆ లారీ యజమాని సలీమ్ ఖాన్ పేర్కొంటూ తనకు 18 కంటైనర్లు ఉన్నాయని, వాటిని పలు సంస్థలకు అద్దెకు ఇచ్చినట్టు తెలిపారు. అయితే వారు ఎటువంటి పనులకు ఉపయోగిస్తారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశాడు. మూడు రాష్ట్రాల పోలీసుల సకాలంలో సమాచారాన్ని బదిలీ చేసుకోవడంతో ఈ ఎటీఎం దొంగలు పట్టుబడ్డారు. వీరికి ఇతర కేసులతో సంబంధం ఉందా, అని విచారిస్తున్నారు. కేరళ త్రిస్సూర్ పోలీసులు సైతం నామక్కల్‌కు చేరుకుని విచారణ జరుపుతున్నారు. కేరళ త్రిస్సూర్‌లో చోరీకి పాల్పడి, నామక్కల్, సేలం జిల్లా సరిహద్దుల వరకు జరిగిన ఈ ఛేజింగ్, ఎన్‌కౌంటర్లో ఓ దొంగ హతం, ఇద్దరు పోలీసుల అధికారులు గాయపడడం వంటి సినీ తరహా ఈ క్‌లైమాక్స్ తమిళనాట పెద్ద చర్చకే దారి తీసింది.
కాల్పుల్లో ఒకరు హతం
తమ కంటైనర్‌ను పోలీసులు చుట్టుముట్టేయడంతో లోపల ఉన్న దొంగలు అలర్ట్ అయ్యారు. లారీని తనిఖీ చేస్తున్న కుమారపాళయం ఇన్‌స్పెక్టర్ తవమణి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రంజిత్‌లపై ఆ దుండగులు దాడికి దిగారు. గడ్డపార, బస్తాలను మోయడానికి ఉపయోగించే పొడవైన కొక్కి తరహా ఆయుధాలతో దాడి చేశారు. ఆ ఇద్దరికి గాయాలు కావడంతో ఇతర అధికారులు తుపాకీకి పనిపెట్టారు. పోలీసుల కాల్పులలో ఒక దొంగ సంఘటన స్థలంలోనే హతమయ్యాడు. మరొకడు గాయపడ్డాడు. దీంతో మిగిలిన ఐదుగురు దొంగ లు లొంగిపోయారు.
ఈ సమాచారం సేలం డీఐజీ ఈ ఎస్ ఉమ నేతృత్వంలో ఎస్పీలు, డీఎస్పీలు రంగంలోకి దిగారు. సంఘటన స్థలంలో విచారించారు. కంటైనర్ లారీలో లగ్జరీ కారు, పెద్ద ఎత్తున నగదు ఉండడంతో సీజ్ చేశారు. గాయపడ్డ పోలీసులను డీఐజీ పరామర్శించారు. పోలీసు కాల్పుల లో మరణించిన దొంగ హర్యానా రాష్ట్రం పుల్వామాకు చెందిన జమీనుద్దీన్‌గా గుర్తించారు. గాయపడ్డ దొంగ అజార్ అలీగా తేల్చారు. పట్టుబడ్డ ఐదుగురిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ప్రాథమిక విచారణలో వీరంతా పుల్వామా నుంచి వచ్చి ఏటీఎంలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చినట్టు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment