‘బస్‌పాస్’ల సొమ్ము గోల్‌మాల్!
‘బస్‌పాస్’ల సొమ్ము గోల్‌మాల్!
Published Wed, Aug 3 2016 9:37 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ప్రై వేటు ఏజెన్సీ సిబ్బంది చేతివాటం
గుట్టుగా కొనసాగుతున్న విచారణ
చిలకలూరిపేట టౌన్ : ఆర్టీసీ బస్‌పాస్‌ల జారీ విషయంలో ప్రై వేటు ఏజెన్సీ సిబ్బంది లక్షల రూపాయలు స్వాహా చేసిన సంఘటన వెలుగుచూసింది. ఆర్టీసీ అధికారుల కన్నుగప్పి కొంతకాలంగా బస్‌పాస్‌ల జారీకి వసూలు చేసిన డబ్బులు ప్రై వేటు ఏజెన్సీ సిబ్బంది కాజేసినట్లు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని జరిగిన ఈ వ్యవహారం చివరకు ఆర్టీసీ హెడ్ ఆఫీస్‌లోని ఐటీ విభాగం అధికారులు గుర్తించేవరకు గుంటూరు రిజియన్ పరిధిలో యథేచ్ఛగా కొనసాగింది. గత ఏడాది జూన్ ముందు వరకు ఆర్టీసీ నెలవారీ పాసులు, స్టూడెంట్ పాసులు, క్యాట్ కార్డులు వంటివి ఆర్టీసీ సిబ్బందే స్వయంగా జారీచేసేవారు. ఆ తర్వాత నుంచి ఈ పాసులు జారీ చేసే విధానాన్ని ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. సంబంధిత ఏజెన్సీ నియమించిన సిబ్బంది అప్పటి నుంచి పాసులను జారీ చేస్తోంది. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని సిబ్బంది హస్తలాఘవం చూపారు. ఉదాహరణకు చిలకలూరిపేట– గుంటూరు నెల పాస్ రూ.1780 ఉంటే ఈ పాస్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తారు. ఆ తరువాత దానిని క్యాన్సిల్ చేస్తారు. చివరకు ఏదో ఒక విద్యార్థికి సుమారు రూ.100తో ఒక పాస్ బుక్ చేసి, ఇంతకు ముందు క్యాన్సిల్ చేసిన నంబరుతో మామూలు సీజన్ పాస్‌కు సంబంధించిన మొత్తాన్ని ప్రింట్ చేసి ఇస్తారు. అప్పుడు రూ.1780లో రూ.100 పోగా మిగిలిన రూ.1680 సిబ్బంది జేబులోకి వెళ్తాయి. ఇలా ఒక్క చిలకలూరిపేట బస్ స్టేషన్ పరిధిలోనే రూ.2.25 లక్షలు కొట్టేసినట్లు తెలుస్తోంది. చిలకలూరిపేటతో పాటు గుంటూరు రిజియన్ పరిధిలోని తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, సత్తెనపల్లి బస్‌స్టేషన్ల పరిధిలోనూ ఈ వ్యవహారం కొనసాగించి ఆర్టీసీ సొమ్ము స్వాహా చేసినట్లు సమాచారం. చివరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు మోసాన్ని గుర్తించి స్థానిక అధికారులకు సమాచారం తెలియజేయటంతో విషయం బయటకు పొక్కింది. దీంతో జిల్లా వ్యవహారాలు పర్యవేక్షించే ఏజెన్సీ ప్రతినిధి ఒకరు చిలకలూరిపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మరో కొత్త విషయం వెలుగుచూసినట్లు సమాచారం. ఎవరైతే ఏజెన్సీ తరఫున జిల్లాలోని ఆర్టీసీ బస్‌స్టేషన్లలో పాసుల జారీ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారో అతని సహకారంతోనే ఈ స్వాహాపర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేయించకుండా ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో ఆ సిబ్బంది నుంచి డబ్బు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ‘సాక్షి’ చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ జి.వెంకటేశ్వర్లును వివరణ కోరగా సొమ్ము చెల్లించే పూర్తి బాధ్యత కృష్ణ ఇన్‌ఫోటెక్ ఏజెన్సీ వారిదేనని తెలిపారు. సిబ్బంది అవకతవకలకు పాల్పడిన విషయం ఏజెన్సీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. పాసుల జారీ విషయంలో రూ.2.25 లక్షలు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు.
ఫిర్యాదు అందింది..
ఇదే విషయంపై చిలకలూరిపేట పట్టణ ఎస్‌ఐ పి.కోటేశ్వరరావును వివరణ కోరగా ఏజెన్సీ తరఫున జిల్లా ఇన్‌చార్జి సంగమేశ్వరరావు డబ్బు గోల్‌మాల్ అంశంలో ఇద్దరిపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు విచారణ దశలో ఉందన్నారు. విచారణ చేసి కేసు నమోదు చేస్తామన్నారు.
Advertisement
Advertisement