వ్యాపారులు ఆదాయ వివరాలు వెల్లడించాలి
నాగులపాడు(పెదనందిపాడు): ప్రతి వ్యాపారి అతని వ్యాపారానికి సంబంధించిన ఆదాయవివరాలు వెల్లడించాలని బాపట్ల ఇన్‌కం ట్యాక్స్ ఆధికారిణి సీహెచ్ అంజనీదేవి అన్నారు. మండలపరిధిలోని నాగులపాడు శ్రీనివాస పాఠశాలలో శుక్రవారం సాయంత్రం వ్యాపారులకు ఆదాయవెల్లడి పథకం–2016పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం 2015–2016 లేదా అంతకుముందు సంవత్సరాలలో సరిగా ఆదాయం ప్రకటించనివారు, ఇప్పుడు ప్రకటించేందుకు ముందుకు రావచ్చని ఆమె చెప్పారు. సదరు డిక్లరేషన్‌కు సంబంధించి ఆదాయపన్ను చట్టం–1961, ఆస్తిపన్ను చట్టం–1957 కింద పెనాల్టీ, ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు పొందవచ్చని వివరించారు. వెల్లడించిన ఆస్తులకు ఆస్తిపన్ను చట్టం–1957 నుంచి మినహాయింపు కూడా ఉంటుందని ఆమె తెలిపారు.స్థిర, చరాస్తుల వెల్లడి 01–06–2016 నుంచి 30–09–2106లోపు చేయాల్సి ఉంటుందని, వెల్లడించిన ఆస్తుల విలువ 01–06–2016 నాటికి మార్కెట్ విలువ, కొన్నప్పటికి విలువలతో గరిష్ట విలువ మీద పన్ను సర్‌చార్జ్, పెనాల్టీలు కలిపి 45 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆమె వ్యాపారులకు వివరించారు. ఈ ఆదాయ వెల్లడిని అన్‌లైన్‌లో కూడా ధాఖలు చేయవచ్చని ఆమె చెప్పారు. ఈ అవగాహన సదస్సులో ఒంగోలు ఇన్‌కం ట్యాక్స్ ఆధికారులు ఈ వెంకట్రావు, ఎస్ జగదీష్, బి.టి.సత్యనారాయణ, ట్యాక్స్ బార్ ఆసోషియేషన్ సెక్రటరి ఎ బాలాజీరావు, సీనియర్ ఇన్‌కం ట్యాక్స్ ప్రాక్టీషనర్ వి.రఘురామయ్య, పారిశ్రామికవేత్తలు దాసరి శేషగిరిరావు, చారెర్టడ్ అకౌంటెంట్‌లు, మరియు ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయ సిబ్బంది పెదనందిపాడు, కాకుమాను మండలాల వ్యాపారులు పాల్గొన్నారు.