
మేనేజ్ మెంట్ కోటా.. హాంఫట్
♦ అమ్మకానికి ‘యాజమాన్య’ సీట్లు
♦ నర్సాపూర్ ‘బీవీఆర్‌ఐటీ’ దందా
♦ కంప్యూటర్ సైన్స్ సీటుకు రూ. 11 లక్షల వరకు డొనేషన్
♦ ఏజెంట్ల ద్వారానే విక్రయాలు
♦ అడ్వాన్స్ ఇచ్చిన వారికే సీటు రిజర్వు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని పేరున్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ.. యాజమాన్య కోటా సీట్లను ‘అమ్మకానికి పెట్టింది’. ఒకవైపు ప్రభుత్వం కన్వీనర్ కోటా తరహాలోనే మేనేజ్‌మెంట్ సీట్లనూ ఆన్‌లైన్‌లోనే నింపాలని భావిస్తోంది. యాజమాన్యం ఇదేం పట్టించుకోకుండా ఏజెంట్లను పెట్టి వేలం పాట తరహాలో సీట్లను రూ. లక్షల డొనేషన్‌కు అమ్ముకుంటోంది.
ప్రతిసారి ఎంసెట్ కింద సీట్ల భర్తీ ప్రక్రియను నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కాలేజీలోనే చేపట్టే సదరు కాలేజీ యాజమాన్యం ఈసారి డిమాండ్ పెరగటంతో పటిష్టమైన ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సీట్ల అమ్మకాలకు తెరతీసింది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మేనేజ్‌మెంటు, ఎన్‌ఆర్‌ఐ కోటాల కింద ఉండే సీట్లను అమ్మాల్సి ఉండగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందే ఇప్పటికే సీట్లను అమ్ముకున్నారు.
నోటిఫికేషన్‌కు ముందే అమ్మకం!
బీవీఆర్‌ఐటీలోని 8 ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో 1110 సీట్లు ఉన్నాయి. ఇందులో 333 సీట్లు మేనేజ్‌మెంటు, ఎన్‌ఆర్‌ఐ కోటాల కింద వస్తాయి. వీటిని ఎంసెట్ కన్వీనర్ నోటిఫికేషన్ విడుదల చేశాక భర్తీ చేయాలి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో మేనేజ్‌మెంటు కోటా సీటును మొదటగా రూ 4.5 లక్షలకు అమ్మకానికి పెట్టగా క్రమంగా డిమాండు పెరగడంతో రూ 9 లక్షలకు చొప్పున అమ్ముకున్నారు. సీఎస్ బ్రాంచ్‌లో 90 సీట్లు యాజమాన్యం కోటా కింద వస్తుండగా మొత్తం అమ్మేశారని తెలిసింది.
అడ్వాన్స్‌లు తీసుకుని..
కనీసం రూ. లక్ష ...ఆపైన అడ్వాన్స్‌గా చెల్లించిన వారికే సీటు రిజర్వ్ చేస్తున్నారు. ఇలా రిజర్వు చేసుకున్న వారికి ఒకవేళ కన్వీనర్ కోటాలో మంచి కాలేజ్‌లో సీటు వస్తే.. అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వబోమనే డిమాండ్‌తోనే రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఈసీఈ బ్రాంచ్‌లో మేనేజీమెంటు కోటా సీటును మొదటగా రూ.3.50 లక్షలకు అమ్మగా డిమాండు పెరగడంతో రూ.6 లక్షలకు పెంచారని, ప్రస్తుతం అందులో సీట్లు లేవని అంటున్నారు. కాగా సీటును యాజమాన్యం నిర్ణయించిన ధర కు పొందినప్పటికి ఏటాప్రభుత్వం నిర్ణయించిన ఫీజును యథాతథంగా చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.
మేనేజ్‌మెంటు కోటా కింద సివిల్ ఇంజనీరింగ్, ఈఈఈ, కెమికల్ ఇంజనీరింగ్, బయో మెడికల్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ బ్రాంచీలలో మాత్రమే ఒకటి రెండు సీట్లు ఉన్నాయని అంటున్నారు. కాగా సివిల్ ఇంజనీరింగ్, ఈఈఈ బ్రాంచీలలోని సీట్లు ఒకటి రెండు రోజుల్లో అయిపోతాయని తెలిసింది. మేనేజ్‌మెంటు కోటా కింద సివిల్ బ్రాంచ్‌లో సీటు రెండున్నర లక్షలకు, ఈఈఈ బ్రాంచ్‌లో సీటును లక్షన్నరకు అమ్ముతున్నారు. దీనిపై క్యాంపస్ డీజీఎం కాంతారావు వివరణ కోరగా..సీట్లు ఇంకా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ వచ్చాక భర్తీ చేస్తామని చెప్పారు.