వేగంగా బైపాస్ | bypass road works starts soon in thandur | Sakshi
Sakshi News home page

వేగంగా బైపాస్

Published Tue, Jun 28 2016 11:48 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

వేగంగా బైపాస్ - Sakshi

వేగంగా బైపాస్

తాండూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్
భూసేకరణకు రెవెన్యూ అధికారుల సర్వే
రోడ్డు హద్దులు ఏర్పాటు చేసిన అధికారులు
డీపీఆర్ సమర్పించిన ఆర్‌అండ్‌బీ శాఖ
బైపాస్ రహదారి పొడవు 13 కి.మీ.
రూ.78 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

 తాండూరు: తాండూరు పట్టణవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. పట్టణం మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు.. ఇక తాండూరులోకి రాకుండానే గమ్యస్థానాలకు చేరుకుంటాయి. తాండూరు- చించొళి మార్గంలోని బెంగళూరు లింక్ ైహైవేలో రూ.78 కోట్లతో నిర్మించనున్న బైపాస్ రోడ్డుతో ఇది సాధ్యంకానుంది. ఇప్పటికే ఆర్ అండ్ బీ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. బైపాస్ రోడ్డు కోసం 13 కి.మీ. మేర సుమారు వంద ఎకరాల వరకు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణపై యాలాల రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే పూర్తికావొచ్చింది.

తాండూరు ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావులు కూడా బైపాస్ రోడ్డు పనులు మొదలుపెట్టేందుకు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి పెంచారు. బెంగళూరుకు చెందిన హెచ్‌బీఎస్ కన్సల్టెన్సీ సంస్థ ఈ రోడ్డు వెళ్లే ప్రాంతాలపై తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు నివేదికను అందజేసింది. స్వల్ప మార్పులతో ఆ నివేదికను ఉన్నతాధికారులు ఆమోదించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అధికారులు కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుమారు 13 కి.మీ. పొడువు నిర్మించనున్న బైపాస్ రోడ్డు హద్దులను గుర్తించారు.

 ఇక రెవెన్యూ అధికారులు రోడ్డు నిర్మించే ప్రతిపాదిత ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, పట్టాభూములు ఏ మేరకు ఉన్నాయో గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయమై రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే తుది దశలో ఉంది. రెవెన్యూ అధికారుల నివేదిక అందిన తరువాత భూనిర్వాసితులు ఉంటే వారికి పరిహారం చెల్లింపు, టెండర్ల ప్రక్రియ అనంతరం ఈ పనులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు.

 బైపాస్‌తో తీరనున్న సమస్యలు..
బైపాస్ రోడ్డుతో తాండూరులో తీవ్ర రూపం దాల్చిన వాయు కాలుష్యం తగ్గుతుంది. పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలకు ఆస్కారం ఉండదు. తద్వారా తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి తాండూరుకు, తాండూరు నుంచి ఇతర రాష్ట్రాలకు వివిధ ఉత్పత్తుల రవాణా చేసే భారీ వాహనాల రాకపోకల ప్రక్రియ పట్టణ శివారు నుంచి కొనసాగుతుంది. ఫలితంగా పట్టణంలో ట్రాఫిక్ చిక్కులు తీరుతాయి.

 బైపాస్ రోడ్డు ఇలా..
కోడంగల్ వైపు నుంచి కాగ్నా వంతెన దాటిన తరువాత శ్రీనివాస్ వేబ్రిడ్జి సమీపంలో ఎడమ వైపు నుంచి ఈ బైపాస్ రోడ్డు ప్రారంభమవుతోంది. ఇక్కడి నుంచి గౌతమీ స్కూల్ వెనుక నుంచి కోకట్ ప్రభుత్వ పాఠశాల పక్కగా, రైల్వే ట్రాక్ మీదుగా వెళుతుంది. అక్కడి నుంచి రాజీవ్ స్వగృహ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వెనుక నుంచి హైదరాబాద్ రోడ్డు మీదుగా బీసీ వసతి గృహం ప్రహరీగోడ పక్క నుంచి బైపాస్ రోడ్డు వెళుతుంది. బాబుమియా తండా సమీంలోని గుట్ట మీదుగా అంతారం చెరువు ప్రారంభం పాయింట్ నుంచి భూకైలాస్ దేవాలయం బయటి నుంచి చెంగోల్ చెరువు ప్రారంభ పాయింట్ పక్కగా తాండూరు రూరల్ సీఐ కార్యాలయం వెనుక నుంచి చించొళ్లి రోడ్డుకు ఈ రోడ్డు కలుస్తుంది.

బైపాస్‌లో 34 వంతెనలు, ఒక ఆర్‌ఓబీ
సుమారు 13 కి.మీ.పొడవుతో బైపాస్ రోడ్డు (బీటీ) నిర్మించనున్నాం. ఇది డబుల్ బైపాస్ రోడ్డు వెళ్లే మార్గాల్లో 34 చోట్ల వంతెనలు, కోకట్ వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వస్తుంది. ఈ రోడ్డు వెడల్పు 7 మీటర్లు. ఈ రోడ్డుకు వంద ఎకరాలు అవసరం. రెవెన్యూ అధికారులు భూసేకరణ చేసి, అప్పగించాల్సి ఉంది. ఈ ప్రక్రియ తరువాత టెండర్లు నిర్వహిస్తాం.  - శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ, డీఈఈ, తాండూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement