కేజ్ మేడ్ ఈజీ
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలోని శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చేపల పెంపకానికి సంబంధించి కేజ్ కల్చర్‌ను జలాశయం నీటి మధ్యలో నిర్మించారు. ఈ కేజ్ చూడటానికి ఎంతో అందంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యం ఎందుకంటే చూడటానికి ఈ కేజ్ చాలా భారీ నిర్మాణంగా కనిపిస్తుంది. ఈ కేజ్‌ను జలాశయంలో నీటిలో ఎలా నిర్మాణం చేపట్టి ఉంటారన్న సందేహం చూసిన ప్రతి ఒక్కరిలో కలుగక మానదు. అయితే నిర్మాణ పనులను ఒక్కసారి పరిశీలిస్తే కేజ్ మేడ్ ఈజీ అనిపించక మానదు. ఈ కేజ్‌కు సంబంధించిన గదుల నిర్మాణం, మేతను భద్రపరిచే షెడ్డు లాంటి నిర్మాణాన్ని ముందుగా గట్టు మీదే తయారు చేస్తారు. అనంతరం వీటికి తాడులు కట్టి జాలరులు పడవలపై ప్రయాణిస్తూ జలాశయంలో మధ్యలోకి తీసుకువెళ్తారు. అక్కడ తాడుల సహాయంతో నిర్మాణాలను జాగ్రత్తగా నీటిలోకి దించుతారు.
నీటి మధ్యలోకి వెళ్లాక ఈ నిర్మాణం ఎటూ కదలకుండా సుమారు 200 నుంచి 300 కేజీల బరువు కలిగిన సిమెంట్ రాళ్లను నలువైపులా తాడులతో కేజ్ నిర్మాణానికి కడతారు. నీటి అడుగుభాగంనకు రాళ్లు వెళ్లేలా వదులుతారు. ఒక కేజ్ కల్చర్‌కు 20 నుంచి 30 రాళ్ల వరకు కట్టి నీటిలో వదులుతారు. దీంతో ఈ రాళ్ల బరువుతో ఎంతటి గాలి వీచినా ఎటూ కదలకుండా నిర్మాణాలు నీటిపై తేలియాడతాయి. ఇదన్న మాట నిర్మాణం వెనుక ఉన్న అసలు రహస్యం. ఇలా రెండు కేజ్ కల్చర్ నిర్మాణాలు చేపట్టారు.