సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశంలో సబ్సిడీ మీద రొయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. చేపపిల్లలను వంద శాతం సబ్సిడీతో అందచేస్తూ ముదిరాజ్, బెస్త తదితర సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు జీవన్‌రెడ్డి, ముఠా గోపాల్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. 2022–23లో 4.67 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 23,748 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలామని చెప్పారు. చేపల మార్కెటింగ్ కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో 647 సొసైటీలు ఉండగా, ఇప్పుడు వాటిని 5112కు పెంచుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా లక్ష మందికి సభ్యత్వం ఇచ్చినట్లు చెప్పారు.
పాల ఉత్పత్తి పెంపునకు చర్యలు
విజయ డెయిరీని మూసివేసే పరిస్థితి నుంచి పురోగమించే స్థితికి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తలసాని అన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిపై సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, జైపాల్ యాదవ్, భాస్కర్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెపుతూ విజయ డెయిరీతో పాటు కరీంనగర్, ముల్కనూర్ తదితర నాలుగు సహకార డెయిరీల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment