
కాల్‌మనీ కేసులు.. కొత్త రూటు!
విజయవాడ : కాల్‌మనీ కేసులు కొత్త రూట్‌లోకి మళ్లుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు కాల్‌మనీ కేసుల్లో నిందితులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు రివర్స్‌లో నిందితులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రత పెరిగి మళ్లీ కాల్‌మనీ కేసులు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల క్రమంలో కొత్త లాబీయింగ్ మొదలైంది. అటు పోలీసులకు, ఇటు కాల్‌మనీ నిందితులకు మధ్యే మార్గంగా వారి మధ్య సయోధ్య కుదర్చటానికి ఒక మహిళ రంగంలోకి దిగింది. దీంతో కాల్‌మనీ కేసుల్లో కొత్త లాబీయింగ్ షురూ అయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ స్థాయి ఉన్నతాధికారులకు సుపరిచితమైన ఈ మహిళ ఈ వ్యవహారంలో చక్రం తిప్పే యత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ముఖ్యంగా నిందితుల నుంచి పోలీసులపై ఫిర్యాదు రూపంలో ఒత్తిడి రాకుండా ఉండటానికి, పోలీసుల నుంచి నిందితులపై ఒత్తిడి రాకుండా ఉండటానికి బలమైన కసరత్తు సాగుతోంది.
గత ఏడాది డిసెంబర్‌లో కాల్‌మనీ - సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర సంచలనంగా మారిన క్రమంలో ప్రభుత్వాన్ని కూడా కొంత ఇరకాటంలో పడేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసు విషయంలో సీరియస్‌గా స్పందించారు. వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పలువురు కీలక నిందితులు చాలా కాలం తర్వాత లొంగిపోయారు. నిందితుల్లో ఒకరైన వెనిగళ్ల శ్రీకాంత్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన కానిస్టేబుల్ పొట్లూరి రమేష్‌ను ఇటీవల అవినీతి ఆరోపణలతో సస్పెండ్ చేశారు. దీంతో రమేష్‌ను, టాస్క్‌ఫోర్స్ ఏసీపీని లక్ష్యంగా చేసుకుని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు వరుస ఫిర్యాదులు అందాయి. దీనిపై పోలీసుల విచారణ కూడా కొనసాగుతోంది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొంత ఇరకాటంలో పడ్డారు. మరికొందరు బాధితులు కూడా ఫిర్యాదులకు సిద్ధమైనట్లు సమాచారం.
సయోధ్య కోసం...
పోలీసులపై వరుస ఫిర్యాదులు రావటం మంచి పరిణామం కాదనే ఉద్దేశంతో పలువురు అధికారులు.. పోలీసులతో వ్యవహారం తమకే ఇబ్బందనే ఉద్దేశంతో కాల్ మనీ నిందితులు.. సయోధ్య యత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అందులో భాగంగానే మధ్యే మార్గంగా పరిష్కారం చేయటానికి అందరికీ ‘కావాల్సిన’ సదరు మహిళను రంగంలోకి దించినట్లు తెలి సింది. గతంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసి ప్రస్తుతం స్టేషన్ సీఐగా విధుల్లో ఉన్న అధికారితో ఈ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. కాల్‌మనీ కేసుల్లో ఉన్న నిందితులకు ఇబ్బంది కలగించకుండా చూడాలని, తాను హైదరాబాద్ స్థాయిలో ఉన్న అధికారులతో కూడా మాట్లాడానని సహకరించాలని కోరి సదరు మహిళ కొంత మొత్తం ముట్టజెప్పినట్లు తెలిసింది. ప్రజాశక్తి నగర్‌లో ఒక అపార్టుమెంట్‌లో ఉండే సదరు మహిళ సీఐతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కబెడుతున్నట్లు సమాచారం. కాల్ కేసుల్లో కీలక నిందితులు, కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అధికార పార్టీ నేతలకు ఇబ్బంది రాకుండా చూసుకోవటమే ఎజెండాగా ఆమె పనిచేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.