మాయదారి, రోగం.. లేదమ్మా, ‘కారుణ్య’ం
- బ్లడ్‌కేన్సర్‌తో చితికిపోతున్న ఆరేళ్ల చిన్నారి
ముద్దులొలికే చిన్నారి.. మృత్యువు ముంగిట కొట్టుమిట్టాడుతోంది. ఆడుతూ..పాడుతూ బడికెళ్లాల్సిన అమ్మాయి..ఆస్పత్రిలో పడకకే పరిమితమై.. సూదులు, మందులు.. చికిత్సతో అవస్థ పడుతోంది. కూలీనాలి చేసుకొని బతికే అమ్మానాన్న.. బిడ్డకొచ్చిన బ్లడ్‌కేన్సర్‌ను తలుచుకొని వెక్కివెక్కి ఏడుస్తున్నారు. లక్షవరకు అప్పుసొప్పు చేసి.. వైద్యమందించి.. ఇప్పుడు డబ్బులేక, బిడ్డ గోస చూడలేక కుమిలిపోతున్నారు. దాతలు దయతలిస్తే.. విరాళాలు అందిస్తే.. మెరుగైన వైద్యం చేయిస్తామని వేడుకుంటున్నారు. కరుణ చూపి కారుణ్యను బతికించాలని మొక్కుతున్నారు.
టేకులపల్లి :
బొమ్మనపల్లికి చెందిన మేడగాని సాయిబాబు, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా..ఆరేళ్ల చిన్నమ్మాయి కారుణ్యకు పెద్ద కష్టం వచ్చింది. ఆరు నెలల క్రితం ఇంట్లో అక్క కీర్తనతో కలిసి ఆడుకుంటూ.. బల్లపైనుంచి కింద పడటంతో కాలికి, కణితి వద్ద దెబ్బ తగలగా కొత్తగూడెం, ఖమ్మం ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. కొన్ని నెలలు మందులు వాడారు. అయినా..కాలువాపు తగ్గకపోవడం, నలతగా ఉంటుండటంతో హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రి, నీలోఫర్‌లో చూయించారు. అనంతరం ఎంఎన్‌జీ దవాఖానలో పరీక్షించిన వైద్యులు పాపకు బ్లడ్‌కేన్సర్ ఉందని నిర్ధారించారు. గత నాలుగు నెలల నుంచి చిన్నారి అక్కడి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతోంది. గీత కార్మికుడు అయిన సాయిబాబు రూ.లక్ష వరకు అప్పు చేసి..ఇప్పటి వరకు వైద్యం కోసం వెచ్చించాడు. చికిత్స ఉచితంగా అందుతున్నప్పటికీ.. రోజు విడిచి రోజు రక్తం ఎక్కించడానికి, బయటి నుంచి మందులు కొనడానికి రూ.2వేల వరకు ఖర్చవుతోందని, అంత డబ్బు లేక, అప్పు దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందిస్తే..అమ్మాయి బతికే అవకాశాలు ఉన్నాయని, కొన్నాళ్లపాటు కూతురిని చూసుకోగలుగుతామని అంటున్నారు. దాతలు ఆర్థికసాయం చేయాలని, బిడ్డకు ప్రాణభిక్ష ప్రసాదించాలని వేడుకుంటున్నారు.
ఆర్థికసాయం
చేయాలనుకుంటే..
మేడగాని సాయిబాబు
బ్యాంకు ఖాతా నంబర్: 7301768921–6
ఏపీజీవీబీ, టేకులపల్లి బ్రాంచి
సెల్ నెంబర్ : 95420 69696