క్రీడల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న గోపీచంద్
-
వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ అంతటా అకాడమీలు
-
‘సాయ్’ సహకారంతో 30 మందికి ఉచిత శిక్షణ
-
1989లో వరంగల్‌లో మెుదటిసారి ఆడాను
-
ఇక్కడి వాతావరణం క్రీడాకారులకు శక్తి ఇస్తుంది
-
బ్యాడ్మింటన్ ఇండియన్ టీం కోచ్ పుల్లెల గోపిచంద్
వరంగల్ స్పోర్ట్స్ : ఆగస్టు 8 నుంచి రియోలో జరగనున్న ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతారని ఇండియన్ బ్యాడ్మింటన్ టీం కోచ్ పుల్లెల గోపీచంద్ దీమా వ్యక్తం చేశారు. హన్మకొండలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్–17, 19 బాలబాలికల టోర్నమెంట్‌ను శుక్రవారం గోపిచంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రియోలో సింధు మొదటిసారిగా పాల్గొంటున్నదని, సింధు ఆట పాజిటివ్‌గా ఉందన్నారు. ఒలంపిక్స్ అంటేనే చాలా టఫ్ ఆ దిశగా మరింత సాధన చేస్తున్నారు.
సింధు సింగిల్స్‌లో రాణిస్తుందనే నమ్మకం ఉందని, సింధుతో పాటు సైనా, జ్వాలా, అశ్వినిలు సైతం దూకుడుపైనే ఉన్నారని, ఒలంపిక్స్‌లో సత్తా చాటడం ఖాయమన్నారు. గతంలో జరిగిన నాలుగు ఒలంపిక్స్‌లను స్పెయిన్, జపాన్, కొరియా, ఇండియా ఇలా ఒక్కోసారి ఒక్కో దేశం విజయం పరంపర కొనసాగిందని, అందులోనూ ఒక్క ప్లేయరే అన్ని ఒలింపిక్స్ ఆడలేదని, ఒక్కో ఒలింపిక్స్‌లో ఒక్కొక్కరు ఆడారు కాబట్టి మన క్రీడాకారులు నెగ్గుతారని గట్టి చెప్పొచ్చన్నారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని అకాడమీలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని గోపీచంద్ చెప్పారు.
ఇప్పటికే హైదరాబాద్‌లోని అకాడమీ లో 125 మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) సహకారంతో తన అకాడమీలో 30 మంది క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. వరంగల్ లో ప్రతిభ గల క్రీడాకారులు ఉంటే వారికి సైతం అవకాశం ఉంటుందన్నారు. కాగా, గోపీచంద్ కూతురు గాయత్రి అండర్–17 విభాగంలో రంగారెడ్డి జిల్లా తరఫున ఆడుతున్నది. కూతురు ఆటను గోపీచంద్ ఇతర క్రీడాకారులు, అధికారులతో కలిసి వీక్షించారు.