కారులోంచి ఎగసిన మంటలు
♦ జాతరకు వెళ్లి వస్తుండగా కారు దగ్ధం
♦ ప్రయాణికులు సురక్షితం
మనుబోలు: ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగగా.. ఆ కారు పూర్తిగా దగ్ధమైన ఘటన మనుబోలు మండలం పొదలకూరు క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉదయగిరి పట్టణానికి చెందిన మేడా హరిహర, ఉమామహేశ్వరావు అనేవారు తమ కుటుంబ సభ్యులు మరో ముగ్గురితో కలిసి సొంత ఇండిగో కారులో వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో కారు మనుబోలు మండల పరిధిలోని పొదలకూరు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగా.. హఠాత్తుగా ఇంజిన్‌లోంచి పొగలు రాసాగాయి. వెంటనే కారును ఆపేసి అందులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు దిగారు. అందులోని సామగ్రిని సైతం హుటాహుటిన బయటకు తీశారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు ఎగసి కారు దగ్ధమైంది. సమాచారమందుకున్న గూడూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.