కూలీ పనులకు వెళ్తూ..
-
కానరాని లోకాలకు
-
కారు అదుపు తప్పి భర్త మృతి
-
ప్రాణాలతో బయటపడిన భార్యా పిల్లలు
కోవూరు : విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఎదుగుతూ పది మందికి సహాయ పడుతుండటం చూసి సహించలేకపోయింది. ఎన్నో కష్టాలు పడి కుదురుకుంటున్న కుటుంబ యజమానిని రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ దురదృష్ట సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై భారత్‌బెంజ్ షోరూం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని సూదరగుంట రామాపురానికి చెందిన ఎద్దు ఏడుకొండలు (34) బెంగళూరులో కూలీలను తీసుకుని వెళ్లి బేల్దారి పనులు చేయించేవాడు. ఇటీవల రామాపురంలో జరిగిన ఓ వివాహానికి ఏడుకొండలు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చాడు. శనివారం రాత్రి ఏడుకొండలు భార్య అంకమ్మ, మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో పాటు తండ్రి చెన్నయ్య, సమీప బంధువు చలమయ్యతో కలిసి బెంగళూరుకు బయలుదేరారు. పడుగుపాడు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుకొండలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగిలిన వారికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అళహరి వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అందరిని బతికించేందుకు..
కారు నడుపుతున్న ఏడుకొండలు ప్రమాదంలో అందరిని బతికించేందుకు తాను ప్రాణాలను పణంగా పెట్టాడు. కారు అదుపు తప్పిన సమయంలో ఏడుకొండలు బయటకు దూకేసి ఉంటే కారు పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తాపడేది. దీంతో పెనుప్రమాదం జరిగేది. అయితే ఏడుకొండలు అప్రమత్తమై కారు కంట్రోల్ చేస్తూ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఇనుపు కంచెను ఢీకొన్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బోల్తా పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు.
మమ్మల్ని బతికించి నువ్వు దూరమయ్యావా...
మమ్మల్ని బతికించేందుకు నీవు దూరమయ్యావా అంటూ ఏడుకొండలు భార్య అంకమ్మ రోదిస్తూ విలపిస్తుంది. ఇద్దరు బిడ్డలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న తీరను చూసిన స్థానికులను కలిచివేసింది. ఏడుకొండలకు భార్యతో పాటు నలుగురు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.