పుష్కర భక్తులకు ఇబ్బంది రానివ్వకండి
పుష్కర భక్తులకు ఇబ్బంది రానివ్వకండి
Published Fri, Jul 29 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
జంగారెడ్డిగూడెం : అంత్యపుష్కరాల ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్(జేసీ) పి.కోటేశ్వరరావు ఆదేశించారు. పట్టిసీమ, గూటాల పుష్కర ఘాట్‌లలో అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమీక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు బాగుండాలని, చిన్న చిన్న పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ప్రత్యేకంగా పారిశుధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. రెండు ఘాట్‌లలోను 12 బోట్లు, 30 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్టు జేసీ తెలిపారు. మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచి, ఒక స్పీడ్ బోటును కూడా సిద్ధం చేయాలని సూచించారు. గోదావరిలో ఒకవేళ నీటి మట్టం తగ్గినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు ఘాట్‌లలోను పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు అవసరమైన ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. అవసరమైతే బస్సులను కూడా పెంచాలని సూచించారు. ఘాట్‌ల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మద్యం దుకాణం లేకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి నదిలో భక్తులు వేసే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. గోదావరిలో బోట్లలో నిరంతరం పహరా నిర్వహించాలన్నారు. భక్తులు పూజలు నిర్వహించుకునేందుకు అవసరమైన పురోహితులను కూడా నియమించాలని సూచించారు. ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ జె.వెంకటరావు, మద్ది ఈవో పి.వివ్వనాథరాజు, అసిస్టెంట్ ఎంవీఐ శ్రీనివాస్, పోలవరం తహసీల్దార్ ముక్కంటి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement