పత్తిని పరిశీలిస్తున్న సండ్ర వెంకటవీరయ్య తదితరులు
రఘునాథపాలెం : విత్తనం అమ్మిన డీలర్లపైనే కాదు విత్తనాలు తయారు చేసిన కంపెనీలపై కూడా కేసులు నమోదు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. గురువారం రఘునాథపాలెం మండలంలో నకిలీ విత్తనాలు, తెగుళ్లతో దెబ్బతిన్న మిరప, పత్తి పంటలను జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ భారీ వర్షాలతోపాటు నకిలీ విత్తనాలతో జిల్లా రైతాంగం పెద్ద మొత్తంలో నష్టపోయిందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతుంటే కొంతమంది అధికార పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 2,500 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మద్దినేని స్వర్ణకుమారి, కోటిరెడ్డి, ఏలూరి శ్రీనివాసరావు, గొడ్డెటి మాధవరావు, సుమంత్, హరీష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే, నాయకులు ఆత్మహత్యకు పాల్పడిన వెంకన్నకు చెందిన పత్తి పొలాన్ని పరిశీలించారు.