నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
-
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
జిల్లాలోని ప్రతి మండలంలోను నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ బంగళాలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలపై ఈ నెల 27వ తేదీన స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10.30 నుంచి 1.00 గంట వరకు టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు తహసీల్దార్లు, ఎంపీడీఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డీఆర్‌డీఏ ఏపీఎంలు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు, స్వయం సహాయక సంఘాల లీడర్లు, డ్వామా సిబ్బంది ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. డెబిట్, రూపే కార్డులు, స్వైపింగ్ మిషన్లపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జన్‌ధన్ అకౌంట్లు రన్నింగ్‌లోకి తీసుకురావాలన్నారు. షాపింగ్‌మాల్స్, వ్యాపారసంస్థలు, పెట్రోలు బంకులు, కూరగాయల మార్కెట్లలో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం నగదు రహిత లావాదేవీలపై శిక్షణ పొందిన వారితో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన 46 గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల్లోని కంప్యూటర్ అధ్యాపకులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
అధికారుల ప్రతిజ్ఞ
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అధికారులందరిచేత కలెక్టర్ ముత్యాలరాజు ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ మార్కండేయులు ఉద్యోగులఽతో ప్రతిజ్ఞ చేయించారు. కాగా సౌదీఅరేబియాలో గుండెపోటుతో మరణించిన శోభన్‌బాబు భార్య, పిల్లలు కలెక్టర్‌ను జీవనోపాధి కల్పించమని కోరారు. సమావేశంలో సీపీఓ పీబీకే మూర్తి, డ్వామా పీడీ హరిత, డీఈఓ మువ్వా రామలింగం పాల్గొన్నారు.